ముంబై మాదిరి ముంచెత్తితే ఎలా? | - | Sakshi
Sakshi News home page

ముంబై మాదిరి ముంచెత్తితే ఎలా?

May 28 2025 5:39 PM | Updated on May 28 2025 6:55 PM

నగరం మునకేయకుండా చర్యలు అవసరం

భారీ వర్షాలొస్తే సరిపోని నాలాల సామర్థ్యం

సాఫీగా సాగిపోని నాలాలు.. రోడ్లపైకి వరద నీరు

ముందస్తు కార్యాచరణతోనే సమస్యలకు ముకుతాడు

సరైన దిశా నిర్దేశం ఉండాలంటున్న నగర పౌరులు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ నగరంలో మూడు సెంటీమీటర్ల వర్షం పడినా రోడ్లు చెరువులవుతున్నాయి. కాలనీలు నీట మునుగుతున్నాయి. అదే ముంబై మాదిరిగా 25 సెంటీమీటర్లు, అంతకుమించి వర్షం పడితే? నగరం ఏం కానుందన్న ప్రశ్నలు ప్రజల నుంచి వెలువడుతున్నాయి. 2020లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అప్పటినుంచే ప్రభుత్వాలు ముంపు సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టినప్పటికీ, పనులింకా పూర్తి కాలేదు. అప్పటి కంటే ముంపు సమస్యల తీవ్రత తగ్గినప్పటికీ పూర్తిగా సమసి పోలేదు. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా వర్షాకాలానికి ముందే ముంచుకొస్తున్న వానలు ప్రజల్లో అలజడి రేపుతున్నాయి. ఎప్పుడు వర్షాలొచ్చినా నగరంలో ఎదురవుతున్న పరిస్థితులే ఇందుకు కారణం. నాలాలు సాఫీగా ప్రవహించే పరిస్థితి లేక వరదనీరు పొంగిపొర్లడం, తీవ్ర ఆస్తి నష్టంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణనష్టాలు కూడా జరగడం ప్రజలను కలవరపెడుతున్నాయి.

తప్పుతున్న అంచనాలు

సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్‌ రెండో వారంలో వర్షాలొస్తాయనే అంచనాలతో ప్రభుత్వ యంత్రాంగాలు ముందస్తు చర్యలు చేపడుతుంటాయి. ఈ ఏడాది సైతం జూన్‌ను దృష్టిలో ఉంచుకొనే జీహెచ్‌ఎంసీ గత కమిషనర్‌ ఇలంబర్తి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌లు సంయుక్త సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని భావించారు. ఇంకా ఆ పనులు జరగలేదు. మరోవైపు హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ సైతం వానాకాలం ముందస్తు చర్యలపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఇటీవలే అధికారులతో నిర్వహించాల్సిన సమీక్ష సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. 

జీహెచ్‌ఎంసీలోని అధికారులు సైతం ఆయా పనులు చేస్తున్నప్పటికీ, ఇంకా అవి పూర్తికాలేదు. వారు జూన్‌ నెలను లక్ష్యంగా పెట్టుకొని పనులు చేపట్టారు. వాస్తవానికి లక్ష్యం కంటే ఇంకొంత ఆలస్యం జరగడం పరిపాటి. ఈసారి జూన్‌కు ముందే నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. రోహిణి కార్తెలో రోకండ్లు పగిలే ఎండలుంటాయనేది పెద్దలు చెప్పే మాట. కానీ కాలం, వాతావరణం, పరిస్థితులు మారాయి. ఎండలు మండే మే నెలలోనూ కుండపోత వానలు కురుస్తున్నాయి. పనులు వేగంగా జరగకపోవడానికి ఇదీ ఒక కారణం. అనుకోకుండా భారీ వర్షాలొస్తే మాత్రం నగర ప్రజలు విలవిలలాడాల్సిన పరిస్థితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరింత ముందు చూపుతో మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నానా కష్టాల నాలాలు
వానల్లో కలిగే ఎక్కువ నష్టాలకు నాలాలే కారణం. ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మారని ప్రజల వైఖరి కూడా నాలాల సమస్యలకు కారణం. నాలాల్ని సకల వ్యర్థాలు వేసే ప్రాంతాలుగా భావిస్తున్న ప్రజలు వాటిల్లోనే పాత దుప్పట్ల నుంచి మొదలు పెడితే పనికిరాని కుర్చీల వరకు వేస్తున్నారు. దాంతో నీరు పోయే దారి లేక పరిస్థితి దారుణంగా మారుతోంది. డీసిల్టింగ్‌లోనూ సమస్యలు తలెత్తుతున్నాయి.

ఉపశమనానికి హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్స్‌
భారీగా నీరు చేరి వాహనాలు మునిగిపోయే ప్రాంతాల్లో రోడ్లపై ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు 50 వరకు రెయిన్‌వాటర్‌ హార్విస్టింగ్‌ స్ట్రక్చర్స్‌ నిర్మించాలనుకున్నప్పటికీ, తొలిదశలో పనులు చేపట్టిన 12లో 11 పూర్తిచేశారు.

ఐసీసీసీలో కీలక విభాగాల సమావేశం
వర్షాకాలం నేపథ్యంలో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ విభాగాలు దృష్టి పెట్టాయి. ఇందుకోసం కీలక విభాగాలకు చెందిన అధికారులతో జాయింట్‌ యాక్షన్‌ టీమ్‌ (జాట్‌) ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో (ఐసీసీసీ) కీలక విభాగాలకు చెందిన అధికారులు సమావేశమయ్యారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో సాగిన ఈ భేటీలో పలు కీలకాంశాలు చర్చించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 141 వాటర్‌ లాగింగ్‌ ఏరియాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటర్‌ లాగింగ్‌ ఏరియాల్లో ట్రాఫిక్‌ నిర్వహణపై చర్చించారు. 

భారీ వర్షం కురిసిన సందర్భంలోనూ తక్షణం స్పందించిన విద్యుత్‌ పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. రహదారులపై నిలిచే వరద నీటిని వాహనచోదకులతో పాటు స్థానికులకు ఇబ్బందులు లేకుండా నాలాల్లోకి మళ్లించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. విపత్తుల సమయంలో స్పందిచడంపై స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) రూపొందించాలని ఫైర్స్‌ డీజీ వై.నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. సమావేశంలో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌, సైబరాబాద్‌ సంయుక్త సీపీ డాక్టర్‌ గజారావు భూపాల్‌, ఐసీసీసీ డైరెక్టర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి పాల్గొన్నారు.

‘ఢీ’ సిల్టింగ్‌

వాస్తవానికి జనవరి నుంచే నాలాల్లో పూడికతీత పనులు (డీసిల్టింగ్‌) ప్రారంభించి, మేలోగా పూర్తిచేయాల్సి ఉండగా, ఈసారి ఉన్నతాధికారులు తరచూ మారడంతో టెండర్లు.. పనులు కూడా ఆలస్యంగా మొదలయ్యాయి. దాంతో పనులు పూర్తి కాలేదు.

డీ సిల్టింగ్‌ .. జోన్ల వారీగా

జోన్‌ నాలాలు పనులైంది

(కి.మీ) (నాలాలు)

ఎల్‌బీనగర్‌ 104.39 77.86

చార్మినార్‌ 387.75 281.91

ఖైరతాబాద్‌ 181.11 98.19

శేరిలింగంపల్లి 74.96 49.05

కూకట్‌పల్లి 103.28 74.01

సికింద్రాబాద్‌ 100.20 69.97

మరింత అప్రమత్తత అవసరం
వానలు ముందస్తుగానే వస్తున్నందున అధికార యంత్రాంగం మరింత ముందుచూపుతో వ్యవహరించాలని నగర ప్రజలు భావిస్తున్నారు. మరి అధికారులు ఎలా వ్యవహరించనున్నారో. ఏయే ప్రత్యేక చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే!

పూర్తయింది..
కేసీపీ జంక్షన్‌, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ (2), సెక్రటేరియట్‌ బస్టాప్‌, జూబ్లీహిల్స్‌ రోడ్‌నంబర్‌ 45, ఖాజాగూడ, సాగర్‌ రింగ్‌రోడ్‌, పీవీఎన్‌ఆర్‌ పిల్లర్‌ నంబర్‌ 264, చిల్కానగర్‌ టి జంక్షన్‌.

పూర్తి కావాల్సింది..
ఆర్‌టీఏ ఆఫీస్‌, ఖైరతాబాద్‌.

నాలాల నుంచి తీసిన పూడిక  1
1/2

నాలాల నుంచి తీసిన పూడిక

ఖైరతాబాద్‌ జోన్‌లోని వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్‌  2
2/2

ఖైరతాబాద్‌ జోన్‌లోని వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement