
కిషన్ నాయక్ (ఫైల్)
వనస్థలిపురం ఠాణా పరిధిలో దారుణం
హస్తినాపురం: తన వివాహేతర సంబంధంపై నిలదీశాడనే కోపంతో కట్టుకున్న భర్తనే చంపేసింది ఓ భార్య. ప్రమాదవశాత్తు ఇంట్లోపడి చనిపోయాడని కట్టుకథ అల్లి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. చివరికి అసలు విషయం బయటపడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వనస్థలిపురం పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిల్లపల్లి గ్రామం సభావత్ తండాకు చెందిన లారీ డ్రైవర్ కిషన్ నాయక్ తన భార్య చనిపోవడంతో ఇదే జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన శిరీషను ఎనిమిదేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కొంతకాలంగా శిరీష ప్రవర్తనపై కిషన్ నాయక్ అనుమానంతో ఆమెను మందలించేవాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవలు జరగడంతో శిరీష హిల్ కాలనీలో వేరుగా ఉంటోంది. సోమవారం రాత్రి భర్త కిషన్ నాయక్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. భార్య శిరీష వద్దకు కిషన్ నాయక్ వెళ్లాడు. ఆమె వివాహేతర సంబంధంపై మళ్లీ నిలదీయడంతో కిషన్ నాయక్‌పై దాడిచేసి గోడకు నెట్టివేసింది. దీంతో అతను తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. తన భర్త ప్రమాదవశాత్తు ఇంట్లో పడి చనిపోయాడని చిత్రీకరించేందుకు శిరీష యత్నించింది.
విషయం తెలుసుకున్న కిషన్‌నాయక్ మొదటి భార్య కూతురు బిందు, బంధువులు అతడి మృతిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిరీషను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేయడంతో.. భర్త కిషన్ నాయక్‌ను తానే హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసులు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.