
ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రూ.14.5 లక్షలు స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: రుణ మంజూరు ప్రాసెసింగ్ పేరిట నగరానికి చెందిన ఓ యువకుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.14.5 లక్షలు కాజేశారు. ఈ మేరకు బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్న ఓ యువకుడు (36) కొన్నాళ్ల క్రితం ఇన్‌స్ట్రాగామ్‌లో తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామనే ప్రకటనకు ఆకర్షితుడైన అందులో ఉన్న రెండు నంబర్లతో సంప్రదింపులు జరిపారు. తనకు రూ.కోటి రుణం కావాలని చెప్పడంతో.. సైబర్ నేరగాళ్లు కొన్ని పత్రాలు, ప్రస్తుతం చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన వివరాలు పంపించాలన్నారు. బాధితుడు పంపించిన వివరాలను పరిశీలించి రుణం మంజూరు చేశామని నేరగాళ్లు నమ్మించారు. ఆ డబ్బు బదిలీ చేయాలంటే కొంత ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలంటూ రూ.14.5 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా తమ బ్యాంకు ఖాతాలో వేయించుకున్నారు. కొన్నాళ్లు ఎదురు చూసిన బాధితుడు తనకు రావాల్సిన రూ.కోటి రాకపోవడంతో నేరగాళ్లను సంప్రదించే ప్రయత్నం చేశారు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైం ఠాణాను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితులు వినియోగించిన ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌మీడియాలో, ఫోన్ కాల్స్ ద్వారా వచ్చే ఇలాంటి ప్రకటనలు నమ్మవద్దని, కేవలం ఆర్‌బీఐ అధీకృత బ్యాంకులు, సంస్థల నుంచే రుణాలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.