
మై స్కూల్ ఇటలీ నిర్వాహకురాలిపై స్థల యజమాని దౌర్జన్యం
సీఎం ప్రజావాణిలో మహిళా ఎన్నారై ఫిర్యాదు
లక్డీకాపూల్: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25 లో స్థలాన్ని లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న మై స్కూల్ ఇటలీ విద్యా సంస్థ ప్రాంగణంలో స్థల యజమాని రోనక్ యార్ ఖాన్ అతని అనుచరులు దౌర్జన్యం చేస్తూ భౌతిక దాడికి పాల్పడటమేగాక బీభత్సం సృష్టించారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటలీకి చెందిన ఎన్నారై డాక్టర్ వల్లూరు అపర్ణ సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్‌చార్జ్ డాక్టర్ జి. చిన్నా రెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌లు వెంటనే స్పందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి బాధితురాలికి న్యాయం చేయాలని సూచించారు. డాక్టర్ వల్లూరు అపర్ణ యూకేలో ఉన్నతాభ్యాసం చేశారు. ఇటలీకి చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ పెప్పోను వివాహం చేసుకుని అక్కడే స్థిర పడ్డారు. మాతృదేశంపై మమకారంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆమె సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలో మై స్కూల్ ఇటలీ విద్యా సంస్థను నెలకొల్పేందుకు రోనక్ యార్ ఖాన్ కు చెందిన ఎకరం స్థలాన్ని 2027 వరకు లీజుకు తీసుకున్నారు. సదరు స్థలంలో స్కూల్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండగా స్థల యజమాని దౌర్జన్యం చేసి స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఒత్తిడి పెంచుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వివాదంపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే కేసు నమోదైందని తెలిపారు.
రూ.50 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తాం
జీడిమెట్ల/కుత్బుల్లాపూర్: రూ. 50 లక్షలు ఇవ్వాలని లేని పక్షంలో మాజీ ఎన్‌ఎస్‌యూఐ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) అధ్యక్షుడు కూన రాఘవేందర్‌గౌడ్‌ను చంపేస్తామని బెదిరిస్తూ మావోయిస్టుల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు అతని తండ్రి కూన రవీందర్‌గౌడ్‌కు లేఖ రాసి కారుపై పెట్టి వెళ్లిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. షాపూర్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త కూన రవీందర్‌గౌడ్ కుమారుడు రాఘవేంద్రగౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా పని చేశారు. ఈనెల 21న రాత్రి మంకీ క్యాప్, టీషర్ట్ ధరించిన వ్యక్తి అతడి ఇంటి మొదటి అంతస్తుకు వెళ్లాడు. ఆ తర్వాత కిందికి దిగి కారుపై ఎర్రటి వస్త్రంలో ఓ కవర్ పెట్టి అనంతరం ఇంటి ముందు ఉన్న తులసి మొక్కను తొలగించి వెళ్లిపోయాడు. 22న ఉదయం రవీందర్‌గౌడ్ తులసి మొక్క తొలగించి ఉండటాన్ని గుర్తించి పనివాళ్లతో మొక్కను అదే తొట్టిలో నాటించాడు. కొద్దిసేపటి తర్వాత కారుపై ఉన్న కవర్‌ను తెరిచి చూడగా నక్సలైట్ శంకరన్న గ్యాంగ్ పేరుతో రాసిన లేఖను గుర్తించాడు. షాపూర్‌నగర్‌లో ఉన్న రెండు ఇళ్లను పేల్చివేస్తామని.. నీకొడుకు రాఘవేంద్రను చంపేస్తామని..శుక్రవారం లోగా రూ.50లక్షలు సిద్ధంగా ఉంచుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈ విషయమై కూన రాఘవేంద్ర గౌడ్ ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్టు
మూసాపేట: గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన విక్రాంత్ రెడ్డి కూకట్‌పల్లిలోని హాస్టల్‌లో ఉంటూ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. భూపాలపల్లి జిల్లాకు చెందిన దీక్షిత్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన అభినయ్, మంచిర్యాలకు చెందిన అన్షు అతడి స్నేహితులు. గంజాయికి అలవాటు పడిన వీరు గంజాయిని కొనుగోలు చేసి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వారికి పరిచయమైన అనురాగ్, వినయ్ కూడా వారితో జత కలిశారు. దీంతో వారు 10 కేజీల గంజాయిని కొనుగోలు చేసి తీసుకువచ్చారు. కూకట్‌పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక టీస్టాల్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడి చేసిన పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుల్లో ఒకరైన అభినయ్ 2024లో బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని, మిగిలిన ముగ్గురూ ఖాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అనురాగ్, వినయ్ కోసం గాలిస్తున్నామన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మున్సిపల్ సిబ్బందిపై దాడి
నిందితులపై కేసు నమోదు
ఉప్పల్: విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్ సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తులపై ఉప్పల్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ పారిశుద్ధ్య సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్‌లుతో కలిసి మంగళవారం రామిరెడ్డినగర్ కూడలి వద్ద రోడ్డుపై వేసిన చెత్తను శుభ్రం చేస్తున్నారు. అదే సమయంలో అదే ప్రాంతానికి చెందిన మణెమ్మ అనే మహిళ రోడ్డుపై నిర్లక్ష్యంగా చెత్తను పారబోస్తుండటంతో ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ రోడ్డుపై చెత్త వేయవద్దని ఇంటికి వచ్చే ఆటోలోనే చెత్త వేయాలని లేని పక్షంలో ఫైన్ విధిస్తామని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ఆమె అతడితో వాగ్వాదానికి దిగింది. ఇంట్లో ఉన్న వ్యక్తులను పిలిచి గొడవ పెట్టుకుంది. ఈ లోగా అక్కడికి వచ్చిన పారిశుద్ధ్య సిబ్బంది ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా ఆమె కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా పారిశుద్ద్య కార్మికులు జానకి, లక్ష్మీ, దేవి, సుజాత, జంగమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్‌పై దాడి చేసి గాయపరిచారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రథమ సంవత్సరంలో చేరేందుకు అడ్మిషన్లకోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్టు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ నాగార్జునరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులకు ఎంపీసీ, ఎంజెడ్సీ, బీజెడ్సీ, ఎంపీసీఎస్, బీఏ, బీకాం, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలో అడ్మిషన్ పొందేందుకు నేరుగా గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు.
పోలీసులకు
బాధితుడి ఫిర్యాదు
మావోయిస్టుల పేరుతో
కూన రవీందర్‌గౌడ్‌కు లేఖ