
‘పురుడు’ పోస్తున్నాయి
మూత పడినా
పలు ఆస్పత్రుల్లో ఏళ్ల తరబడి సాగుతున్న నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల దందా
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎంతోకాలంగా సాగుతున్న బర్త్(పుట్టుక), డెత్(మరణం)నకిలీ సర్టిఫికెట్ల దందా ఆగడం లేదు. అధికారులు ఒక మార్గంలో కట్టడి చర్యలు చేపడితే, వాటిపై ఆధారపడ్డ దళారులు మరో మార్గంలో తమ దందా నడిపిస్తున్నారు. వారికి, కొన్ని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు, జీహెచ్‌ఎంసీలోని కొందరు సిబ్బందికి మధ్య ఉన్న సంబంధాల కారణంగానే ఈ అక్రమ సర్టిఫికెట్ల దందా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవసరమైన వారి నుంచి అధికమొత్తంలో వసూలు చేసి నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేసే వ్యవహారం జీహెచ్‌ఎంసీలో ఎంతో కాలంగా సాగుతోంది. కొన్ని సందర్భాల్లో పోలీసులు వాటిని బట్టబయలు చేశారు. అక్రమ సర్టిఫికెట్ల జారీని నిలువరించేందుకు జీహెచ్‌ఎంసీ చేస్తున్న ప్రయత్నాలు వృథా అవుతున్నాయి. ఇటీవలే టోలిచౌకి మెట్రో హాస్పిటల్ నుంచి 65 బర్త్ సర్టిఫికెట్లు, 8 డెత్ సర్టిఫికెట్లను నకిలీవిగా జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించడం తెలిసిందే.
మరెన్నో ఆస్పత్రులు..
జీహెచ్‌ఎంసీలో వేల సంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. వాటిల్లో దాదాపు 1800 ఆస్పత్రులకు బర్త్, డెత్‌ల వివరాలు ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు జీహెచ్‌ఎంసీ వాటికి లాగిన్ సదుపాయం కల్పించింది. జనన, మరణ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు కావడంతోపాటు బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఇన్‌స్టంట్‌గా జారీ చేసి, ప్రజలకు ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేశారు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం నాన్ అవైలబిలిటీ పేరిట దాదాపు 25వేల బర్త్ సర్టిఫికెట్లు ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా పొందినట్లు గుర్తించిన అధికారులు వాటిని రద్దు చేశారు. తిరిగి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రుల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో జరిగే శిశువుల జననాలకు రికార్డులు ఉండనందున వాటిని నాన్ అవైలబిలిటీగా పేర్కొంటూ, ఆర్డీఓ ధ్రువీకరణలతో అందజేస్తారు.ఎలాంటి ధ్రువీకరణలు, ఏ పత్రాలు లేకున్నా వేల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు జారీ కావడంతో ఆ తర్వాత పలు చర్యలు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. కానీ, ఆస్పత్రులు సైతం నకిలీ దందాలకు పాల్పడటాన్ని గుర్తించలేకపోయింది.
వెలుగులోకి ఇలా..
గత జీహెచ్‌ఎంసీ కమిషనర్ నాన్ అవైలబిలిటీ కింద బర్త్ సర్టిఫికెట్ల కోసం ఎన్నో దరఖాస్తులు రాావడంతో అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వాటి పరిశీలనతోపాటు, ప్రైవేట్ ఆస్పత్రులపై సర్వేకు కూడా ఆదేశించారు. దీంతో సర్వే నిర్వహించిన అధికారులు 510 ఆస్పత్రులు పనిచేయడం లేదని గుర్తించారు. సదరు సర్వే సందర్భంలోనే మూతపడ్డ మెట్రో హాస్పిటల్‌నుంచి సైతం బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ కావడాన్ని గుర్తించి, మూతపడ్డ 510 ఆస్పత్రులకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసే సదుపాయాన్ని రద్దు చేశారు. వాటిలోనూ నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన ఆస్పత్రులున్నాయో, లేవో, ఉంటే ఎన్ని ఆస్పత్రులు ఎన్ని సర్టిఫికెట్లను జారీ చేశాయో తెలియదు.