మీటర్ల ‘గోల్‌’మాల్‌ వ్యవహారంలో ఏఈ సహా మరో ఇద్దరిపై వేటు | - | Sakshi
Sakshi News home page

మీటర్ల ‘గోల్‌’మాల్‌ వ్యవహారంలో ఏఈ సహా మరో ఇద్దరిపై వేటు

May 6 2025 10:05 AM | Updated on May 6 2025 12:42 PM

మీటర్ల ‘గోల్‌’మాల్‌ వ్యవహారంలో ఏఈ సహా మరో ఇద్దరిపై వేటు

మీటర్ల ‘గోల్‌’మాల్‌ వ్యవహారంలో ఏఈ సహా మరో ఇద్దరిపై వేటు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: విద్యుత్‌ మీటర్ల గోల్‌మాల్‌ వ్యవహారంలో బాధ్యులపై వేటు పడింది. ఏఈ సహా లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, మీటర్‌ రీడర్లను సస్పెండ్‌ చేసింది. మంజూరైన మీటర్లను సంబంధిత వినియోగదారుల నివాసాలకు అమర్చకుండా గుట్టుగా నిల్వ చేసిన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చింది. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సైబర్‌సిటీ సర్కిల్‌ ఇబ్రహీంబాగ్‌ డివిజన్‌ చిత్రపురి కాలనీలోని ఓ కాంట్రాక్టర్‌ ఇంట్లో 42 విద్యుత్‌ మీటర్లు లభ్యమైన విషయం తెలిసిందే. దుండిగల్‌, ఇబ్రహీంబాగ్‌, సరూర్‌నగర్‌లో విద్యుత్‌ మీటర్లు పక్కదారి పట్టిన విషయంపై మూడు రోజుల క్రితం సాక్షిలో ‘మీటర్ల గోల్‌మాల్‌’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. 

ఈ అంశంపై సీఎండీ ముషారఫ్‌ ఫా రూఖీ సీరియస్‌ కావడంతో పాటు సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు రంగారెడ్డిజోన్‌ సీజీఎం పాండ్యానాయక్‌ అంతర్గత విచారణ చేపట్టి సీఎండీకి సమగ్ర నివేదిక అందజేశారు. ‘తెలుగు సినీ వర్కర్స్‌ కో ఆపరేటీవ్‌ సొసైటీ’ పేరున జనవరి 25న 42 విద్యుత్‌ మీటర్లు జారీ చేసినట్లు గుర్తించారు. డిస్కం మంజూరు చేసిన ఈ మీటర్లను వినియోగదారుల ఇంటికి అమర్చకుండా కాంట్రాక్టర్‌ చెన్నకేశవరెడ్డి తన ఇంట్లోనే నిల్వ చేయడంతో పాటు ఏప్రిల్‌ నెలలో వీటికి బిల్లులు కూడా జారీ చేశారు. ఈ అంశంపై స్థానిక ఏఈ భాస్కర్‌రావు సహా లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, మీటర్‌ రీడర్ల ప్రయేయం ఉన్నట్లు నిర్ధారణ అయింది. 

మీటర్ల గోల్‌మాల్‌కు కారణమవడంతో పాటు సంస్థ ఆర్థిక నష్టాలకు కారణమైన ఏఈ సహా మీటర్‌ రీడర్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్లను డిస్కం యాజమాన్యం సోమవారం సస్పెండ్‌ చేసింది. అంతేకాకుండా సదరు కాంట్రాక్టర్‌పై ఇప్పటికే రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయించింది. బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చడంతో పాటు లైసెన్సును రద్దు చేయాల్సిందిగా కోరుతూ సీఈఐ జీకి లేఖ రాసింది.
 

ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం 

ఉప్పల్‌: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా, కోదాడకు చెందిన తుమాటి గోపీకృష్ణా రెడ్డి (27 అనే యువకుడు హాస్టల్‌ నిర్వహిస్తూ అన్నోజి గూడ ప్రేమలత అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నాడు. అతడికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆదివారం సాయంత్రం స్నేహితుడిని కలిసేందుకు చైతన్యపురి వెళ్లిన అతను సోమవారం తెల్లవారుజామున ఇంటికి బయలుదేరాడు. నాగోల్‌ మేట్రో స్టేషన్‌ వద్ద యూటర్న్‌ తీసుకుంటుండగా ఉప్పల్‌ నుంచి నాగోల్‌ వైపు వేగంగా వచ్చిన లారీ అతడిని ఢీకొట్టింది. లారీ చక్రాల కింద పడిన అతడిని దాదాపుగా 10 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో అతని శరీరం నుజ్జు నుజ్జుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మూటగట్టి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీకోసం గాలిస్తున్నారు.

గంజాయి పట్టివేత

కుత్బుల్లాపూర్‌: ఎస్‌టీఎఫ్‌బీ సిబ్బంది దాడి చేసి ఓ వ్యక్తి నుంచి రూ.1.3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్‌టీఎఫ్‌బీ ఎస్‌ఐ బాలరాజు నేతృత్వంలో సోమవారం శివారెడ్డినగర్‌లో దాడులు నిర్వహించిన సిబ్బంది షరీఫ్‌ అనే వ్యక్తి నుంచి 1.3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అతడి నువచి బైక్‌, సెల్‌ఫోన్‌ సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో అఖిల్‌ అనే మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఎండీఎంఏ డ్రగ్‌ స్వాధీనం..

లంగర్‌ హౌజ్‌ ప్రాంతంలో హెచ్‌డీఎఫ్‌బీ బృందం దాడులు నిర్వహించి 5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకుంది. మహమ్మద్‌ సులేమా అనే వ్యక్తి డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసిన పోలీసులు అతడి నుంచి డ్రగ్స్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడికి డ్రగ్స్‌ సరఫరా చేసిన బెంగళూరుకు చెందిన షకీల్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని గోల్కొం ఎకై ్సజ్‌ స్టేషన్‌లో అప్పగించారు.

భార్య అనుమానించిందని.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య

సనత్‌నగర్‌: భర్త వేరే యువతితో కలిసి ఉన్న ఫొటోను చూసిన భార్య అనుమానంతో నిలదీయగా మనస్తాపం చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బేగంపేట అన్నానగర్‌లో సాయికుమార్‌ (23), పూజ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే సాయికుమార్‌ తరచూ తమ పక్కింటి యువతితో మాట్లాడుతుండేవాడు. ఈ క్రమంలో అతను సదరు యువతితో కలిసి ఉన్న ఫొటోను చూసిన పూజ అతడిని నిలదీసింది. దీంతో మనస్తాపం చెందిన సాయికుమార్‌ ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి అనురాధ ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 1
1/1

ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement