
బయోచార్ ఉత్పత్తులతో నేలలు సారవంతం
కొత్తూరు: బయోచార్ ఉత్పత్తులతో వ్యవసాయ పొలాలు, నేలలు మరింత సారవంతంగా మారుతాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ అన్నారు. నందిగామ మండలం, కన్హా శాంతివనంలో హార్ట్ ఫుల్‌నెస్, పాపెల్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బయోచార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో మోతాదుకు మించి రసాయన ఎరువులు వినియోగిస్తున్నారన్నారు. దీంతో పొలాలు, వాతావరణం కలుషితమవుతోందని తెలిపారు. దీనికి తోడు రైతులు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. బయోచార్ ఉత్పత్తులతో పొలాలు మరింత సారవంతంగా మారడంతో పాటు పంటల దిగుబడి సైతం పెరుగుతుందన్నారు. గ్రామీణ స్థాయిలో చిరు వ్యాపారులు, రైతులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉన్నారన్నారు. వారికి బయోచార్ ఉత్పత్తులు మరింత ఆర్థికంగా బలోపేతం చేయడానికి తోడ్పడతాయన్నారు. గ్రామీణ స్థాయిలో బయోచార్ ప్లాంట్లను నెలకొల్పడానికి యువ పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. తక్కువ ఖర్చు, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం, లాభసాటిగా ఉండే పంటలసాగుపై రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఏటా పంటల వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారని, దీంతో కాలుష్యంతో పాటు ఇతర ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు తెలిపారు. బయోచార్ ఉత్పత్తులతో పంటల వ్యర్థాలను పొలాలకు బలం చేకూర్చే ఎరువులను తయారు చేసే అవకాశం ఉందన్నారు. బయోచార్ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా రైతులు వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్లాంట్ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో హార్ట్‌ఫుల్‌నెస్ వ్యవస్థాపకుడు కమ్లేష్ జీ పటేల్, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.