
రూ.10 కోట్ల విలువైన గంజాయి దహనం
సికింద్రాబాద్: సికింద్రాబాద్ జిల్లా రైల్వే పోలీసులు వివిధ కేసుల్లో పట్టుకున్న రూ.10 కోట్ల విలువైన 2 వేల కిలోల గంజాయిని సోమవారం దహనం చేశారు. యాదాద్రి జిల్లా, తొక్కాపూర్ గ్రామంలోని రోమో ఇండస్ట్రీస్ సహకారంతో గంజాయిని దహనం చేసినట్లు రైల్వే ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. సికింద్రాబాద్ అర్బన్ డివిజన్‌లో 49 కేసుల్లో పట్టుబడిన 1419 కిలోలు, రూరల్ డివిజన్‌లో 5 కేసుల్లో పట్టుబడిన 100 కిలోలు, కాజీపేట డివిజన్ పరిధిలో పట్టుబడిన 490 కిలోల గంజాయిని దహనం చేశామన్నారు. గంజాయి ఉత్పత్తి చేసే ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే అన్ని రైళ్లలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం ద్వారా గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. 74 కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసిన మీదట న్యాయ సలహాలు తీసుకుని గంజాయిని దహనం చేశామన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ అర్బన్ డీఎస్‌పీ ఎస్‌ఎన్ జావెద్, రూరల్ డీఎస్‌పీ శ్రీనివాస్, కాజీపేట డీఎస్‌పీ టి.కృపాకర్ పాల్గొన్నారు.