
మహిళలే జట్టుకట్టి..
మియాపూర్: భవన నిర్మాణాల వద్ద విలువైన సామగ్రి, సెంట్రింగ్ వస్తువుల చోరీకి పాల్పడుతున్న మహిళల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.7లక్షల విలువైన అల్యూమినియం సెంట్రింగ్ సామగ్రి, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్, ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్, డీఐ రమేష్ నాయుడుతో కలిసి వివరాలు వెల్లడించారు. సైదాబాద్‌లోని సింగరేణి కాలనీకి చెందిన ముడావత్ పద్మ, నెనావత్ విజయ, బిల్లావత్ లక్ష్మీ, నెనావత్ అమృత, సభావత్ సునిత, వాడిత్య అనిత, ఆటోడ్రైవర్ నెనావత్ చందర్ ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో భారీ భవన నిర్మాణ సముదాయాల వద్ద సెంట్రింగ్ సామగ్రి, ఇతర విలువైన వస్తువుల చోరీకి పాల్పడుతున్నారు. వీరిలో ఒకరు ఉదయం వేళల్లో కాలనీల్లో తిరుగుతూ సెక్యూరిటీ లేని భవనాలను ఎంచుకుని ముఠా సభ్యులకు సమాచారం అందిస్తారు. రాత్రి అందరూ కలిసి ట్రాలీ ఆటోలో తాము ఎంచుకున్న భవనం వద్దకు చేరుకుంటారు. అదను చూసుకుని సెంట్రింగ్ సామగ్రి, ఇతర విలువైన వస్తువులను ఆటోలో వేసుకుని తరలించేవారు. అనంతరం దానిని అమ్మి సొమ్ము చేసుకుంటారు. గత నెల 19న వీరు అర్ధరాత్రి మియాపూర్‌లోని ఓ భవనం వద్ద అల్యూమినియం సెంట్రింగ్ సామగ్రి చోరీకి పాల్పడ్డారు. భవన యజమాని ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులు పద్మ, విజయ, లక్ష్మీ, అమృత, సునిత, అనిత, చందర్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ముడావత్ పద్మపై 16, విజయపై 7, అమృతపై 1, సునిత 2 కేసులున్నట్లు తెలిపారు. వీరు గతంలో జైలుకు వెళ్లి వచ్చినా తమ వైఖరి మార్చుకోకుండా చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు రూ.7లక్షల సెంట్రింగ్ సామగ్రీ, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సెంట్రింగ్ దొంగల ముఠా ఆటకట్టు
రూ.7లక్షల విలువైన సామగ్రి, రెండు ఆటోలు స్వాధీనం
ఆరుగురు మహిళలతో సహా ఆటో డ్రైవర్ అరెస్ట్

మహిళలే జట్టుకట్టి..