
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఉద్యోగి
అబిడ్స్: పాత మీటర్‌కు బదులుగా కొత్తది ఇవ్వాలని, మీటర్‌లో ఎలాంటి బకాయిలు లేకుండా చూసేందుకు రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన టీజీఎస్‌పీడీసీఎల్ మంగళ్‌హాట్ విద్యుత్ సెక్షన్ ఉద్యోగి (గ్రేడ్– 4 ఆర్టిజన్ అబ్దుల్ రహ్మాన్) ఏసీపీ అధికారులకు చిక్కాడు. సీతారామ్‌పేట్‌లోని మంగళ్‌హాట్ విద్యుత్ కార్యాలయంలో ఫిర్యాదుదారు ఉమర్ రూ.20 వేల లంచం ఇస్తుండగా హైదరాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళ్‌హాట్ ప్రాంతంలో నివసించే ఉమర్ ఇంటి కరెంట్ మీటర్‌పై బకాయిలు ఉన్నాయి. బకాయిలు లేంకుడా చూడాలని, ఎలాంటి పెనాల్టీ లేకుండా కొత్త మీటర్ ఇవ్వాలని ఉమర్ విద్యుత్ శాఖ ఉద్యోగి అబ్దుల్ రహ్మాన్‌ను సంప్రదించాడు. దీంతో తనకు రూ.20 వేలు ఇస్తేనే పాత బకాయిలు లేకుండా చూస్తానని రహ్మాన్ హామీ ఇచ్చాడు. మంగళవారం డబ్బులు ఇస్తానని చెప్పిన ఉమర్ నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు తన కార్యాలయంలో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రహ్మాన్‌ను పట్టుకుని కేసు నమోదు చేశారు.
లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి..
నగరంలో ఏ ప్రభుత్వ శాఖలోనైనా అధికారులు, ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే టోల్‌ఫ్రీ నెంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ సూచించారు. అదేవిధంగా వాట్సాప్ నెంబర్ 94404 46106కు కూడా ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని ఆయన సూచించారు. ఫిర్యాదు దారుల పేర్లను ఏసీబీ రహస్యంగా ఉంచుతుందని, లంచగొండి అధికారులపై చర్యలు తీసుకుంటామని గంగసాని శ్రీధర్ వెల్లడించారు.