
సదస్సులో పాల్గొన్న జయప్రకాశ్ నారాయణ తదితరులు
బంజారాహిల్స్: హైదరాబాద్ యూత్ అసెంబ్లీ స్ట్రీట్‌కాజ్ అనే జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం పలు సామాజిక అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐపీఎస్ అధికారి తరుణ్‌జోషి, ప్రొఫెసర్ అరుణ్ తివారి, మాజీ ఐఏఎస్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గౌరవ అతిథులుగా విచ్చేశారు. ఐక్య రాజ్య సమితి నిర్ధారించిన స్థిరమైన లక్ష్యాలలో అత్యంత ప్రధానమైన పేదరిక నిర్మూలన, లింగ వివక్షకు వ్యతిరేకంగా అవగాహన ప్రచారం, వాతావరణ మార్పులు, నాణ్యమైన విద్యపై తీసుకోవాల్సిన తక్షణ చర్యలు వంటి అంశాలను ఈ వేదిక మీద చర్చించారు. ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖులు తమ అమూల్యమైన సలహాలు ఇచ్చారు. వీరి ప్రేరణతో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా విద్యార్థులు తెలిపారు. ఈ సదస్సుకు చైర్‌పర్సన్‌గా ఎం.కీర్తన, కో–చైర్‌పర్సన్‌గా ఎల్.కాత్యాయని, ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా డెన్నిస్ జాన్, క్వాల్విన్ పాల్గొన్నారు. మొత్తం 200 మంది విద్యార్థులు ఈ చర్చలో పాల్గొని సమస్యలను ఎత్తిచూపడమే కాకుండా వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుతూ తగిన సూచనలు అందజేశారు.