
‘ఆత్మీయ’ పలకరింపులు..
ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి అన్ని ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకొనేందుకు వివిధ రకాలుగా వ్యూహాత్మకంగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఎన్నికలకు మరో 14 రోజులే గడువు ఉండడంతో అన్ని పార్టీలు జోరును పెంచాయి. ఎక్కడికక్కడ కార్నర్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేసే అసంఘటితరంగానికి చెందిన కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, సీనియర్ సిటిజన్ సంఘాలు, మహిళాసంఘాలు, దివ్యాంగుల సంఘాలతో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వరకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఆత్మీయసమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారు.
● కేడర్‌ను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఆత్మీయసమ్మేళనాలు దోహదం చేస్తున్నాయి. పార్టీ నాయకత్వంపై అలక వహించిన వారిని, కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నవారిని, అనుమానాస్పదంగా ఉన్న కార్యకర్తలు, నాయకులను తమవైపు తిప్పుకొనేందుకు అభ్యర్ధులు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో బుజ్జగింపులకు దిగారు. అదేసమయంలో ప్రతిపక్షాల్లోని అసంతృప్త నాయకులు, కార్యకర్తలను కూడా తమవైపు మళ్లించేందుకు ఈ సమ్మేళనాలు ఫలితాలనిస్తున్నాయి. ఇవి ఎక్కువగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే జరుగుతున్నాయి. అభ్యర్థులు, నాయకుల ప్రసంగాలు, కేడర్ నుంచి వచ్చే వినతులతో సభలు సాగుతున్నాయి. మధ్యాహ్న భోజనంఅనంతరం సమ్మేళనాలు ముగుస్తున్నాయి. ఒక విధంగా ఇవి ఆయా పార్టీలు తమ కేడర్‌ను బలోపేతం చేసుకొనేందుకు ఏర్పాటు చేసే సమావేశాలు మాత్రమే. కానీ ఇప్పుడు సమ్మేళనాలతో పాటు దావత్‌లు జోరుగా సాగుతున్నాయి.
వేడుక మీది.. వేదిక మాది..
సాధారణంగా ఇళ్లలో కుటుంబసభ్యుల సమక్షంలో, స్నేహితుల సమక్షంలో చేసుకొనే పుట్టిన రోజు వేడుకలు ఎన్నికల వేళ ఫంక్షన్ హాళ్లకు వచ్చి చేరాయి. పుట్టిన రోజు చేసుకొనే వ్యక్తి ఏ కాలనీ సంఘానికో లేదా బస్తీ సంఘానికో నాయకుడైతే చాలు వేడుకలు ఘనంగా జరిగిపోతున్నాయి. అపార్ట్‌మెంట్ సంఘాలకు చెందిన ప్రతినిధులు, వాకర్స్ అసోసియేషన్‌లకు చెందిన నాయకులు, వివిధ కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం వహించే నాయకులకు సైతం వేడుకలు ఘనంగా జరిగిపోతున్నాయి. ఏకంగా ఫంక్షన్ హాళ్లను బుక్ చేసి ‘దావత్’లను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా వేడుకలను ఏర్పాటు చేయడంలో డివిజన్ నాయకులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థులు స్వయంగా పాల్గొంటే ఎన్నికల పరిశీలకులకు చిక్కే ప్రమాదం ఉన్న దృష్ట్యా ఆ బాధ్యతలను డివిజన్ స్థాయి నాయకులకు అప్పగించినట్లు సమాచారం.
సరిహద్దు రాష్ట్రాల నుంచి..
మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించినట్లు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నప్పటికీ అన్ని చోట్ల ఇలాంటి ‘పార్టీ’ల పేరిట మద్యం ఏరులై పారుతోంది. స్థానిక వైన్ షాపుల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్యాన్ని తరలిస్తున్నారు. ఎకై ్సజ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ‘పార్టీ’ల్లో మద్యం ఏరులై పారుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జోరుగా పుట్టిన రోజు వేడుకలు
సన్మానాల్లో వేడుకల జోష్
డివిజన్ నాయకులకే బాధ్యతలు
ఏరులై పారుతున్న మద్యం
కర్మన్‌ఘాట్‌కు చెందిన ఓ కార్మిక సంఘం నాయకుడికి చంపాపేట్‌లోని ఒక ఫంక్షన్ హాల్‌లో బుధవారం సాయంత్రం సన్మానించారు. వందలాదిమంది ‘అభిమానులు’ తరలివచ్చారు. సదరు నాయకుడికి ఆ సన్మాన కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో ఆ ‘అభిమానులె’వ్వరికీ తెలియదు. కానీ అంతా వేదిక వెనుక చేరిపోయారు. దావత్ మరింత ఘనంగా జరిగింది. ఖరీదైన మద్యం బాటిళ్లు తెరుచుకున్నాయి. మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు ఘుమఘుమలాడాయి. అభిమానులు తాగేంత తాగారు. తినగలిగినంతా తిని వెళ్లిపోయారు. వాళ్లకందరికీ అందాల్సి సందేశాలు మొబైల్ ఫోన్‌లో ఆ రోజు సాయంత్రానికే చేరాయి. ఆ డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీలకు చెందిన చాలామంది ‘అభిమానులతో’ రాత్రి 12 గంటల వరకు సందడి కొనసాగింది. ఒక కర్మన్‌ఘాట్‌లోనే కాదు ఎన్నికల వేళ నగరంలోని అన్ని డివిజన్‌లలోనూ ఈ తరహా ‘పార్టీలు’ జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే దావత్‌లలో నేరుగా పాల్గొనలేని అభ్యర్ధులు తమ అనుచరులకు, డివిజన్ నాయకులకు ఆ బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీంతో వివిధ కాలనీలకు చెందిన ప్రముఖుల బర్త్‌డే పార్టీలు, సన్మానాలు ‘భారీ’గా జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఇదో నయాట్రెండ్‌గా కొనసాగుతోంది. – సాక్షి, సిటీబ్యూరో