
నాగోలు(హైదరాబాద్): ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసి నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతంలో పడవేసిన సంఘటన నాగోలు పోలీసుల స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమాముల శివారులో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు నాగోలు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహం వద్ద లభించిన వివరాల ఆధారంగా మృతుడు కాచిగూడకు చెందిన అశోక్ యాదవ్ గా గుర్తించారు. కాచిగూడలో జ్యూస్ షాప్ నిర్వహిస్తున్న అశోక్ యాదవ్‌కు భార్య క్రాంతి దేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎల్‌బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ కృష్ణయ్య, నాగోలు ఇన్‌స్పెక్టర్ సూర్యనాయక్ సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది.
అశోక్ యాదవ్ మృతదేమం లభించిన ఫోన్ ఆధారంగా అతని భార్యకు ఫోన్ చేసిన పోలీసులు సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఇంటి వస్తున్నట్లు సమాచారం అందుకున్న అతడి భార్య ఇంటికి తాళం, జ్యూస్ సెంటర్ మూసి వేసి సెల్‌ఫోన్ ఆఫ్ చేసి పరారైనట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.