బతుకులు బుగ్గి | Major explosion in pharma industry 16 people lost breath | Sakshi
Sakshi News home page

బతుకులు బుగ్గి

Jul 1 2025 12:44 AM | Updated on Jul 1 2025 11:28 AM

Major explosion in pharma industry 16 people lost breath

పేలుడు ధాటికి ధ్వంసమైన పరిశ్రమ భవనం.. తమ వారి ఆచూకీ తెలియక రోదిస్తున్న బాధితురాలు

ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడు

16 మంది కార్మికులు, ఉద్యోగులు దుర్మరణం!

36 మందికి  కాలిన గాయాలు.. పలువురి పరిస్థితి విషమం

కుప్పకూలిన భవనాలు.. శిథిలాల కింద మరికొందరు..

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ కంపెనీలో రియాక్టర్‌ పేలడంతో ప్రమాదం 

చెల్లాచెదురుగా ఎగిరిపడిన కార్మికులు, ఛిద్రమైన శరీరాలు 

అగ్నికీలల్లో పలువురి సజీవదహనం..

సమీప ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు 

మృతుల్లో ఎక్కువమంది ఒడిశా, బిహార్, యూపీ వారే.. 

అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌... ఘటనా స్థలాన్ని,ఆస్పత్రులను సందర్శించిన మంత్రులు.. నేడు సీఎం రాక 

ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌ సహా ప్రముఖుల సంతాపం  

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్‌చెరు టౌన్‌/పటాన్‌చెరు/రామచంద్రాపురం/జిన్నారం/చందానగర్‌: ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరున్న పాశమైలారంలోని సిగాచి అనే ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. కంపెనీలోని రియాక్టర్‌ పేలిపోగా దాని తీవ్రతకు మూడంతస్తుల భవనాలు రెండు కుప్పకూలిపోయాయి. 

పరిశ్రమ పైకప్పు, రేకులు, ఇతర యంత్ర భాగాలు ఎగిరి వంద మీటర్ల దూరంలో పడ్డాయి. యంత్రాల భాగాలు చెల్లాచెదురయ్యాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న 100 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయారు. శరీరాలు ఛిద్రమైపోయాయి. 

10 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా ఇద్దరు ఆస్పత్రుల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. మొత్తం 16 మంది మరణించినట్లు అనధికారిక సమాచారంకాగా, మంత్రులు దామోదర, వివేక్‌ మాత్రం 12 మంది మరణించినట్లు ప్రకటించారు. మృతదేహాలను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. సుమారు 36 మంది గాయపడ్డారు. 20 మందికి పైగా కార్మికులకు 80 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. 

వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలో ఉన్న పటాన్‌చెరు, చందానగర్, మదీనాగూడ, మియాపూర్‌లలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనాల శిథిలాల కింద మరింత మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. 

పరిశ్రమ ఆవరణలో భీతావహ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ వెంకటస్వామి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు సందర్శించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. 

ఘోర దుర్ఘటనపై ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తదితర ప్రముఖులు ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. 

బ్లోయర్‌ పేలి.. రియాక్టర్‌కు అంటుకుని.. 
మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్‌ మైక్రోస్టెల్లయిన్‌ సెల్యులర్‌ పౌడర్‌ను ఉ త్పత్తి చేస్తారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. 

అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్‌ బ్లోయర్‌ పేలింది. దీంతో ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్‌కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమి కంపించినట్టు అయ్యింది. కొందరు కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.  

మృతుల్లో యాజమాన్య ప్రతినిధి? 
మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్‌ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి.  

అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌ 
సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 

భారీ కట్టర్లు, క్రేన్‌లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరా యం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్‌ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి. 

మిన్నంటిన రోదనలు.. ఆందోళన 
కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. విధులకు హాజరై ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి ఆచూకీ అధికారులను ఆరా తీశారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. 

మంత్రి దామోదర రాజనర్సింహ నాలుగు గంటల పాటు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కలెక్టర్‌ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్‌ పంకజ్‌కు పలు సూచనలిచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పరిశ్రమల శాఖ ఫైర్‌ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. 

ఎయిర్‌ ఫైర్‌ సిస్టమ్‌లో ప్రెషర్‌ వల్లే  సిగాచీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారని తెలిపారు.  ప్రభుత్వం తరఫున మెరుగైన ఎక్స్‌గ్రేషియా అందించేందుకు కృషి చేస్తామన్నారు. 

బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మంత్రులు దామోదర, వివేక్‌  

రాజకీయం చేయొద్దు: మంత్రులు 
పేలుడు ఘటనలో గాయపడిన వారిలో హేమ సుందర్, ధర్మరాజ్‌ ప్రసాద్, రాజేష్‌ కుమార్‌ చౌదరి, కమలేష్‌ ముఖియా, చందన్‌కుమార్‌ నాయక్, నగ్నజిత్, అభిషేక్‌ కుమార్, అజిత్‌ తివారి, సంజయ్‌కుమార్, యశ్వంత్‌ కుమార్, ధన్‌వీర్‌ కుమార్, సంజయ్‌ ముఖియా, రాజశేఖర్‌రెడ్డి, దేవనంద్, గణేష్‌ కుమార్, సంజయ్‌కుమార్‌ యాదవ్, నీలాంబర్‌ బట్రా, సమీర్, అమర్జిత్, అర్జున్‌కుమార్, అజిమ్‌ అన్సారీలను మియాపూర్‌ మదీనాగూడలోని ప్రణామ్‌ ఆసుపత్రికి తీసుకువచ్చారు. 

ఇక్కడ చికిత్స పొందుతూ అభిషేక్‌ కుమార్, అజిత్‌ తివారి మృతి చెందారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో ఉన్నవారిని మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, వివేక్‌ వెంకటస్వామి సందర్శించారు. 

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దీనిపై ఎవరూ ఎలాంటి రాజకీయం చేయవద్దని కోరారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఇందుకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. 


సంగారెడ్డి కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం.. 
సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. తక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్‌ను సంప్రదించవచ్చని కలెక్టర్‌ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు.  

నేడు సీఎం సందర్శన 
సిగాచి పరిశ్రమను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఉదయం 10 గంటలకు సందర్శించనున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. అక్కడి కార్మికులతో మాట్లాడనున్నారు. సహాయక చర్యలను కూడా పరిశీలిస్తారు. 

పాశమైలారం పేలుడు ఘటనలో 26కు చేరిన మృతుల సంఖ్య

కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: కేసీఆర్‌ 
సిగాచి పరిశ్రమ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని, చనిపోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి  సూచించారు. 

ఇలావుండగా పాశమైలారం పరిశ్రమలో రియాక్టర్‌ పేలుడు అత్యంత విషాదకరమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. పలువురు కార్మికులు చనిపోయారన్న వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు.  

రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ: సంగారెడ్డి జిల్లాలో సంభవించిన పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రధాని తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. 

ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ‘ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా..’ అని మోదీ పేర్కొన్నారు. 

‘ఈ ఘోర ప్రమాదం గురించి విని చాలా బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తక్షణ సహాయ, రక్షణ చర్యలు చేపడుతున్నారు..’ అని రాహుల్‌ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదంలో అమూల్యమైన ప్రాణాలు పోవడం ఎంతో దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం..’ అని ఖర్గే అన్నారు.

సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి.. ప్రమాదంపై ఆరా 
సాక్షి, హైదరాబాద్‌: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదంఫై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ జితేందర్, సీఎస్‌ రామకృష్ణారావుతో సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. 

సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున సీఎస్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. డిజాస్టర్‌మేనేజ్‌మెంట్‌స్పెషల్‌ సీఎస్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఫైర్‌సరీ్వసెస్‌అడిషనల్‌డీజీని సభ్యులుగా నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతను కమిటీకి అప్పగించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement