స్వతంత్రులే అధికం | - | Sakshi
Sakshi News home page

స్వతంత్రులే అధికం

Published Thu, Nov 16 2023 6:27 AM | Last Updated on Thu, Nov 16 2023 10:37 AM

- - Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం వెల్లడించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌తో సహా శివారు మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 649 మంది అభ్యర్థులు శాసనసభ ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ,మజ్లిస్‌, బీఎస్పీ, సీపీఐ(ఎం)తోసహా ఎన్నికల సంఘం గుర్తింపు పార్టీల అభ్యర్థులు 117 మంది ఉండగా, 532 మంది స్వతంత్ర అభ్యర్థులుగా తమ బలాన్ని ప్రదర్శించుకోనున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీలతో సహా స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 48 మంది పోటీలో ఉన్నారు. అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఐదు స్థానాల్లో 30 మంది కంటే ఎక్కువ మంది
గ్రేటర్‌తోసహా శివారు జిల్లాల్లో 30 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఐదు ఉండగా, హైదరాబాద్‌ జిల్లాలో నాంపల్లి అసెంబ్లీ స్థానంలో 34 మంది అభ్యర్థులు, ముషీరాబాద్‌లో 31 మంది పోటీ పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానంలో 33 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 32 మంది అభ్యర్థులు, మల్కాజిగిరి స్థానంలో 33 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

12 అసెంబ్లీ స్థానాల్లో 20 కంటే ఎక్కువ అభ్యర్థులు
గ్రేటర్‌తోసహా శివారు జిల్లాల్లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు ఎన్నికల రణరంగంలో పోటీ పడుతున్నారు. హైదరాబాద్‌ జిల్లా మలక్‌పేట్‌లో 27 మంది, అంబర్‌పేట్‌లో 20 మంది, ఖైరతాబాద్‌లో 25 మంది, గోషామహాల్‌లో 21 మంది, యాకత్‌పురలో 27 మంది,సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానంలో 24 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తిలో 24 మంది, మహేశ్వరంలో 27, ఇబ్రహీంపట్నంలో 28, రాజేంద్రనగర్‌లో 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్‌ స్థానంలో 22 మంది, కూకట్‌పల్లిలో 24 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

గుర్తుల కేటాయింపు..
అసెంబ్లీ బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులకు వారి సూచన మేరకు గుర్తుల కేటాయింపు కార్యక్రమాన్ని బుధవారం రాత్రి వరకు ఆయా శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు పూర్తి చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన గుర్తుల జాబితా నుంచి స్వతంత్రులకు సింబల్‌ కేటాయింపులు పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. గుర్తుల కేటాయింపు కార్యక్రమం పూర్తికావటంతో ...గురువారం నుంచి ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement