
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని ఈఆర్‌ఓల నుంచి బూత్ లెవల్ అధికారుల వరకు ఓటరు జాబితాలను పరిశీలన చేశారా? లేదా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఓటరు నమోదు నుంచి ఓట్ల తొలగింపు వరకు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు పలు రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. మాదన్నపేట్‌లోని 123వ పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న ఇంటి నంబర్ 17–1–181/ఏ/34లో 125 మంది ఓటర్లు నమోదై ఉన్నారు.
మలక్‌పేట్ నియోజకవర్గంలోని కాలాడేరా కమ్యూనిటీ హాల్ పోలింగ్‌బూత్ (138) పరిధిలో ఉన్న ఒక ప్రభుత్వ క్వార్టర్స్‌లో 16–8–935 ) గతంలో 346 ఓటర్లు నమోదై ఉన్నారు. అధికారులు ఈ తప్పును సవరించినట్లే సవరించారు. కానీ ఇటీవల విడుదలైన జాబితాలో ఇంకా 146 ఓటర్లు మిగిలే ఉన్నారు. యాకుత్‌పురా, చార్మినార్, నాంపల్లి, మలక్‌పేట్, చాంద్రాయణగుట్ట తదితర నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో ఒకే ఓటరు కనీసం అయిదుసార్లు నమోదై ఉన్నాడు.
రెయిన్ బజార్‌లోని ఇంటినంబర్ 17–1–374/హెచ్/బి/23 లో ఓ మహిళ పేరుతో ఏకంగా 14 ఓట్లు నమోదై ఉండటం గమనార్హం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఓటరు లిస్టులను పరిశీలించి బోగస్ ఓట్లు పడకుండా అరికట్టాలని రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు.