అంచనాలకు ఆమోదం

సమావేశంలో పాల్గొన్న బ్రిగేడియర్‌ సోమశంకర్‌, సీఈఓ మధుకర్‌ నాయక్‌, రామకృష్ణ   - Sakshi

రూ. 320 కోట్ల బడ్జెట్‌

కంటోన్మెంట్‌ బోర్డు సమావేశంలో

పలు కీలక నిర్ణయాలు

రసూల్‌పురా: కంటోన్మెంట్‌ బోర్డు కార్యాలయ వివిధ విభాగాల సిబ్బంది బోర్డు సూపరింటెండెంట్‌ ఇళ్లల్లో పనిచేస్తున్నారని ఈ అంశంపై విచారణ జరిపించాలని కంటోన్మెంట్‌ బోర్డు నామినేటెడ్‌ సభ్యులు జె. రామకృష్ణ ఆరోపించారు. గురువారం జరిగిన బోర్డు సాధారణ సమావేశంలో సీఈఓ మధుకర్‌నాయక్‌తో కలిసి పాల్గొన్నారు. రూ.320 కోట్లతో రూపొందించిన 2023–24 వార్షిక బడ్జెట్‌ అంచనాలు (రివైజ్డ్‌) 2024–25 సంవత్సరానికిసంబంధించి వివిధ అభివృద్ధి, నిర్వహణ బడ్జెట్‌పై రూపొందించిన అంచనాలను బోర్డు సమావేశంలో ఆమోదించారు. ఈ ఆమోద తీర్మానాన్ని సదరన్‌ కమాండ్‌ పరిశీలన, ఆమోదం కోసం పుణేకు పంపించాలని నిర్ణయించారు.

● బొల్లారంలోని జీఎల్‌ఆర్‌ సర్వేనంబర్‌ 157లోని 28 ఎకరాల 16 గుంటల బీ–2 స్థలంలో జీ ప్లస్‌ 8 అంతస్తులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ 1200 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ చదరపు మీటర్‌కు రూ. 500 ఫీజు నిర్ణయించారు.

● ఆసుపత్రి నిర్మాణంలో డ్రైనేజీ సిస్టంపై చర్చించి అవుట్‌లెట్‌ను జనప్రియ బంగ్లాస్‌ వద్దనున్న రైల్వే అండర్‌ బ్రిడ్జి వరకు పొడిగించాలని సూచించారు. తాగునీటి వసతి విషయంలో ప్రత్యేకంగా గోదావరి జలాలను అందించేందుకు ప్రత్యేక పైపులైను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

● బోర్డు పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు తక్కువగా ఉన్నారని అధికంగా మురికి కనిపిస్తోందని అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమిస్తున్నామని సీఈఓ తెలపగా సూపరింటెండెంట్‌ అధికారుల ఇళ్లల్లో పారిశుద్ధ్య సిబ్బందితో పాటు డ్రైవర్‌, తోటమాలి, వాచ్‌మెన్లుగా బోర్డు సిబ్బంది పనిచేస్తున్నారని తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని ఈ అంశంపై తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు.

● కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో ఎన్నికల విభాగంలో విధులు నిర్వహిస్తున్న బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల వేతనం గత మూడేళ్ల నుంచి విడుదల కావడం లేదని ఈ అంశాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

● లక్ష్మీనరసింహయ్య బస్తీవాసులకు తాగునీటి ఎద్దడి నివారణకు బోర్డు నిధులు వెచ్చించి పైపులైను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అదే విధంగా ఏడో వార్డులోని సెంట్రల్‌ బట్రిలో డ్రైనేజీ పైపులైను పనులు ప్రారంభం కాలేదని పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రామకృష్ణ బ్రిగేడియర్‌ను కోరారు. కార్యక్రమంలో బోర్డు శానిటరీ సూపరింటెండెంట్‌ ఎం. దేవేందర్‌, ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు ఉమాశంకర్‌, బాలకృష్ణ, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ అక్బర్‌ అలీ పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top