
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ఆరున్నరేళ్ల తర్వాత మరో డీమానిటైజేషన్ చోటు చేసుకుంది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23 నుంచి వీటిని మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి అంగీకరిస్తారు. ఈ పరిణామాలు ‘గ్రేటర్’ పరిధిలోని రియల్టీ, కన్‌స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న పెద్దలతో పాటు రాజకీయ నాయకులకు పెద్ద షాక్ ఇచ్చింది.
సగానికి పైగా నల్లధనమే..
రియల్‌ఎస్టేట్ రంగంలో జరిగే లావాదేవీల్లో అత్యధికం నగదు రూపంలో, అదీ నల్లధనం చెలామణి ఎక్కువ. ఏ భూమి చూసినా దాని కార్డ్ వాల్యూకి, మార్కెట్ ధరకు మధ్య పొంతన ఉండదు. వీటి మధ్య దాదాపు 60 నుంచి 80 శాతం వరకు వ్యత్యాసం ఉంటుంది. కార్డ్ వాల్యూగా పిలిచే ప్రభుత్వ ధర రూ.లక్షల్లో ఉంటే మార్కెట్ రేటు రూ.కోట్లకు చేరుతుంది. ఈ కారణంగానే డాక్యుమెంట్లలో కార్డ్ వాల్యూ నమోదు చేసే క్రయవిక్రయదారులు ఆ మేరకు మాత్రమే డీడీలు, చెక్కులు తదితర రూపాల్లో బదిలీ చేసుకుంటాయి. మిగిలిన మొత్తం నగదు రూపంలో ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో పాటు నిర్మాణ రంగంలోనూ నగదు లావాదేవీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ రెండు చోట్లా చెలామణి అయ్యే వాటిలో రూ.2 వేల నోట్లే ఎక్కువగా ఉంటాయన్నది జగమెరిగిన సత్యం.
నేతలు, బినామీల వద్దా ఇవే..
రాష్ట్ర శాసనసభకు ఈ ఏడాది చివరలో, పార్లమెంట్‌కు వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని చిన్న ఎమ్మెల్యే నియోజకవర్గానికీ రూ.కోట్లలో ఖర్చు పెట్టాల్సిందే. ఎన్నికల సంఘానికి చిక్కకుండా చేసే ఈ ఖర్చుల్లో నల్లధనమే ఎక్కువగా ఉంటుంది. దీని కోసం బడా, ఛోటా నేతలు, వాళ్ల బినామీలు భారీ మొత్తం రూ.2 వేల నోట్ల రూపంలో దాచిపెట్టారన్నది బహిరంగ రహస్యం. ఈ కారణంగానే రూ.3 లక్షల కోట్లకు పైగా విలువైన రూ.2 వేల నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ చెప్తున్నా..బ్యాంకుల్లో మాత్రం ఇవి అందుబాటులో లేవు. బ్యాంకుల్లో లేవనే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ సైతం అంగీకరిస్తోంది. అలా దాచి పెట్టుకున్న నేతలకు ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారింది.
నిఘా పెంచాలని పోలీసుల నిర్ణయం...
ఈ పరిణామాల నేపథ్యంలో నోట్ల మార్పిడికి భారీగా డిమాండ్ రానుంది. దీన్ని అదునుగా చేసుకుని హవాలా ర్యాకెట్లు లావాదేవీలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. వీటన్నింటికీ మించి కమీషన్ తీసుకుని నోట్లు మార్పిడి చేసి ఇచ్చే వ్యవస్థీకృత ముఠాలు, ఆ పేరు చెప్పి మోసాలకు పాల్పడే కేటుగాళ్లు రెచ్చిపోతారు. 2016 నవంబర్ 10న అమలులోకి వచ్చిన డీమానిటైజేషన్ సందర్భంలో ఇలాంటి అనేక ఉదంతాలు నగరంలో చోటు చేసుకున్నాయి.
వీటిని పరిగణలోకి తీసుకుంటున్న పోలీసు, నిఘా విభాగాలు సైతం అప్రమత్తమం అవుతున్నాయి. ఇప్పటికే నగరంలో ఉన్న హవాలా రాకెట్లు, గతంలో ఈ కేసుల్లో అరెస్టు అయి బయటకు వచ్చిన వారిపై ప్రత్యేక నిఽఘా ఏర్పాటు చేయనున్నారు. వీటికి తోడు త్వరలో ఎదురుకానున్న నోట్ల మార్పిడి కష్టాలు తలుచుకుంటూ నగర వాసులు సైతం ఉలిక్కిపడుతున్నారు. 2016 నాటి అనుభవాలను నెమరువేసుకుంటున్నారు.