పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు ప్రయోజనం..
సమర్థవంతమైన, సరళమైన సేవలు
హన్మకొండ: హెచ్‌టీ విద్యుత్ సర్వీస్‌ల మంజూరులో ఏకరీతి విధానాన్ని విద్యుత్ సంస్థలు అమలు చేస్తున్నాయి. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి 11 కేవీ స్థాయిలో అర్హత కలిగిన హై టెన్షన్ (హెచ్‌టీ) విద్యుత్ కనెక్షన్లు, అదనపు లోడ్‌కు ఏకరీతి సర్వీస్ లైన్ చార్జీలను అమలు చేసే విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. లైసెన్స్ డ్యూటీ ఫర్ సప్లయ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆన్ రెక్వెస్ట్ నిబంధనలకు చేసిన మూడో సవరణగా రెగ్యులేషన్ నంబర్ 07 ఆఫ్ 2026ను టీజీ ఈఆర్‌సీ జారీ చేసింది. ఈ సవరణ ద్వారా అర్హత కలిగిన 11 కేవీ హెచ్‌టీ వినియోగదారులకు సర్వీస్ లైన్ చార్జీల విషయంలో స్పష్టమైన, ఏకరీతి విధానం ద్వారా మెరుగైన సేవలు అందనున్నాయి. పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యం, వినియోగదారుల కేంద్రీకృత సేవలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగదారులకు సులభతరమైన, వేగవంతమైన విద్యుత్ సేవలు అందించే దిశగా నిరంతరం చర్యలు చేపడుతోంది.
సర్వీస్ లైన్ వ్యయంపై ముందే స్పష్టత..
కొత్త నిబంధనల ప్రకారం ఇప్పటికే ఉన్న 11 కేవీ విద్యుదీకరించిన కామన్ ఫీడర్ నుంచి ఓవర్‌హెడ్ లైన్ ద్వారా 1 కిలోమీటరు పరిధిలో ఉన్న 11 కేవీ హెచ్‌టీ కొత్త కనెక్షన్లు, అదనపు లోడ్‌కు సరఫరా కల్పించుటకు ప్రతి కేవీఏ కాంట్రాక్టెడ్ డిమాండ్‌కు రూ.4,078 సర్వీస్ లైన్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అర్హత కలిగిన వినియోగదారులకు సర్వీస్ లైన్ వ్యయంపై ముందే స్పష్టత వస్తుంది. దరఖాస్తుల పరిశీలన, ప్రాసెసింగ్‌లో మరింత ఏకరూపత ఏర్పడుతుంది. గతంలో 11 కేవీ స్థాయిలో స్థల పరిశీలన, సాంకేతిక అంచనాల ఆధారంగా సర్వీస్ లైన్ వ్యయాన్ని నిర్ణయించే వారు. కొత్త విధానం అమలుతో అర్హత కలిగిన సర్వీసుల్లో అంచనాలపై ఆధారపడే అవసరం తగ్గి, దరఖాస్తుల ప్రాసెసింగ్ మరింత సరళంగా, వేగవంతంగా జరిగే అవకాశం ఉంటుంది.
ఈ విధానం వల్ల పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ తదితర రంగాల్లో కొత్త విద్యుత్ కనెక్షన్లు లేదా అదనపు లోడ్ల కోసం దరఖాస్తు చేసే అర్హత కలిగిన వినియోగదారులకు వ్యయంపై ముందస్తు స్పష్టత ఏర్పడుతుంది. విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియలో పారదర్శకత, సమయపాలన పెరగడం ద్వారా వ్యాపారాలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన మరింత సులభతరం అవుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి ఏకరీతి సర్వీస్‌లైన్ చార్జీలు ఎంతగానో దోహదపడుతాయి.
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులకు మరింత పారదర్శకమైన, సమర్థవంతమైన, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఆధునిక సాంకేతికత, వేగవంతమైన సేవల ద్వారా నాణ్యమైన విద్యుత్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాం. ఏకరీతి విధానంతో హెచ్‌టీ సర్వీస్‌ల మంజూరు సులభతరం. వినియోగదారులకు ఎంతో మేలు చేకూరుతుంది. – కర్నాటి వరుణ్ రెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ


