నవంబర్‌ 5న వరంగల్‌ ఐఎంఏ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 5న వరంగల్‌ ఐఎంఏ ఎన్నికలు

Oct 12 2026 8:28 AM | Updated on Oct 12 2026 8:28 AM

నవంబర్‌ 5న వరంగల్‌ ఐఎంఏ ఎన్నికలు నేడు గ్రేటర్‌ గ్రీవెన్స్‌ పల్లె సీను సాహిత్యం యువతకు మార్గదర్శి రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలకు జెడ్పీఎస్‌ఎస్‌ విద్యార్థులు

కాశిబుగ్గ: వరంగల్‌ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ఎన్నికలు నవంబర్‌ 5న వరంగల్‌ ఐఎంఏ హాల్‌లో నిర్వహించనున్నట్లు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి, కోరిటర్నింగ్‌ ఆఫీసర్లు డాక్టర్‌ బందెల మోహన్‌రావు, డాక్టర్‌ కె.మల్లేశం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్‌ ఫారాలను ఈ నెల 28 నుంచి అందజేస్తామని, 31 వరకు నామినేషన్లకు దాఖలు చేయాలని, నవంబర్‌ 2న నామినేషన్ల స్క్రూటినీ, 3న విత్‌డ్రా చేసుకోవచ్చని పేర్కొన్నారు. తుది జాబితా విడుదల అనంతరం నవంబర్‌ 5న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐఎంఏ హాల్‌లో పోలింగ్‌ జరుగుతుందని వివరించారు. కాగా, నూతన కమిటీకి ఒక అధ్యక్షుడు, నలుగురు ఉపాధ్యక్షులు, ఒక జనరల్‌ సెక్రటరీ, నలుగురు జాయింట్‌ సెక్రటరీలు, ఒక ఫైనాన్స్‌ సెక్రటరీ, 24 మంది స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్లు ఎంపిక చేయనున్నారు.

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ టి.వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులను అందజేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

వరంగల్‌ కలెక్టరేట్‌లో..

న్యూశాయంపేట: సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సోమవారం వరంగల్‌ కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ కార్యాలయం, రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఆర్డీఓ కార్యాలయం, మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో గ్రీవెన్స్‌ నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే గ్రీవెన్స్‌కు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆమె కోరారు.

హన్మకొండ కల్చరల్‌: పల్లె సీను సాహిత్యం భవిష్యత్‌ తరాలకు ఆమూల్యమైన సాహితీ సంపద అని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ డాక్టర్‌ రియాజ్‌ అన్నారు. శ్రీలేఖ సాహితి వరంగల్‌ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని పల్లె సీను ఐదు పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మేరకు ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ రియాజ్‌, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దహగం సాంబమూర్తి అతిథులుగా హాజరై పల్లె సీను రచించిన గగన తరంగాలు, మైత్రీ భావ తరంగాలు, పల్లె అంతరంగం, నేను కవిత్వాన్ని, నా సాహిత్య సంబంధాలు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె సీను సాహిత్య యువతకు గొప్ప మార్గదర్శిగా ఉంటుందని, ఆయన ఆలోచనలు సాహిత్యం మూలాలను పరి చయం చేస్తుందని, వచన కవిత్వంపై ఆయనకు గొప్ప పట్టు ఉందని అన్నారు. కందుకూరి శ్రీరాములు, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌, టి.ఉడయవర్లు, డాక్టర్‌ పర్చా అంజనీదేవి, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, శంకేశి శంకర్రావు, వరిగొండ కాంతారావు, పల్లె నాగేశ్వరరావు, డాక్టర్‌ ఎన్వీఎన్‌చారి, డాక్టర్‌ పల్లేరు వీరస్వామి, పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.

హసన్‌పర్తి : రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలకు స్థానిక పీఎంశ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల నగరంలో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో పాఠశాలకు చెందిన పి.సిద్ధార్థ, భగత, సాత్విక్‌, సంజ్‌, అహరోన్‌పాల్‌ పాల్గొని అత్యంత ప్రతిభ కనరిచి ప్రథమ స్థానంలో నిలిచి, రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 12 నుంచి 14 వరకు హైదరాబాద్‌లోని బోడుప్పల్‌ డీవీఆర్‌ బాక్సింగ్‌ అకాడమీలో జరిగే పోటీల్లో వారు పాల్గొంటారని కోచ్‌ పార్థసార్థథి తెలిపారు. విద్యార్థులను కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement