ప్రైవేట్‌ హాస్పిటల్‌ సక్సెస్‌ ప్రకటనలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ హాస్పిటల్‌ సక్సెస్‌ ప్రకటనలకు చెక్‌

Oct 12 2026 8:28 AM | Updated on Oct 12 2026 8:28 AM

ప్రైవేట్‌ హాస్పిటల్‌ సక్సెస్‌ ప్రకటనలకు చెక్‌

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..

కాశిబుగ్గ: ఎన్నో కేసులు సక్సెస్‌ చేశామంటూ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం చేయించుకునే ప్రకటనలకు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) చెక్‌ పెట్టింది. కొంతమంది కార్పొరేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు రోగులకు ఆకట్టుకునేందుకు చికిత్స చేయించుకున్నవారి అనుభవాలతో ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. వివిధ స్పెషలిస్టు వైద్యులు తాము చేసే చికిత్సల విజయాలను చెప్పుకుంటూ పరోక్షంగా ప్రకటనలను గుప్పిస్తుంటారు. ఇంకొంతమంది రోగులకు సర్జరీ చేయక ముందు, చేసిన తర్వాత ఎలా ఉంటారో చూపేందుకు వారి క్లినిక్‌లు, నర్సింగ్‌ హోంల్లో పెద్దక్షరాలతో బొమ్మలతో పరోక్షంగా ప్రచారం చేసుకుంటారు. అవి కూడా కళ్లకు అద్దినట్లు రకరకాల రంగులతో దర్శనమిస్తా యి. ఆర్థోపెడిక్‌, ప్లాస్టిక్‌ సర్జరీ, డెంటల్‌, స్కిన్‌ తది తర క్లినిక్‌లలో ప్రచారం చేసుకోవడానికి ఇదో మార్గంగా ఎంచుకుంటారు. ఇక నుంచి ఇలాంటి వాటికి ప్రైవేట్‌ వైద్యులు దూరంగా ఉండాలి.

ఈనెల 6 నుంచి నిబంధనలు అమలు..

ఆయా ఆస్పత్రుల వైద్యులు చేసే ప్రకటనలు, డిజిటల్‌ ప్రచారాలపై కఠినమైన మార్గదర్శకాలను ఈ నెల 6 నుంచి జాతీయ వైద్య మండలి అమలుల్లోకి తీసుకొచ్చింది. వైద్యసేవలను వాణిజ్యపరంగా ప్రచారం చేయడం, రోగులను ఆకట్టుకునేందుకు అతిశయోక్తితో కూడిన ప్రకటనలు చేయడం, వైద్యపరంగా తప్పుడు హామీలు ఇవ్వడం నిషేధంగా చెబుతోంది. వైద్య వృత్తిని కాపాడుకోవడానికి, రోగుల ప్రయోజనాలను పరిరక్షించడం లక్ష్యంగా పలు మార్గదర్శకాలను రూపొందించినట్లు ఎన్‌ఎంసీ అధికారులు పేర్కొంటున్నారు.

ప్రచారాలకు దూరంగా ఉండాలి..

ఆయా ఆస్పత్రులు సోషల్‌ మీడియా, వెబ్‌సైట్లు, వాట్సాప్‌, ఇన్‌ఫ్లుయన్సర్‌ మార్కెటింగ్‌, డిజిటల్‌ ప్రచారాలు, స్పాన్సర్డ్‌ పోస్టులు, ఏఐ ఆధారిత ప్రచారాలు కూడా నిబంధనల పరిధిలో ఉన్నాయి. రోగుల ఫొటోలతో ప్రచారం చేసుకోకూడదు. పేషంట్ల చికిత్స ముందు, చికిత్స తర్వాత పేరుతో ఫొటోలు వాడొద్దు. ఇటీవల కాలంలో టీవీల్లో అధికంగా కనిపిస్తున్న చికిత్స పొందిన రోగుల ఫొటోలు, వీడియోలు, వైద్య రికార్డులు, క్లినికల్‌ చిత్రాలు, టెస్టిమోనియల్స్‌, వ్యక్తిగత వివరాలతో కూడిన ప్రకటనలను నిషేధించింది.

వ్యక్తిగత ప్రచారం బంద్‌..

కొంతమంది ప్రైవేట్‌ వైద్యులు వ్యక్తిగత విజయాలు, చికిత్స అందించిన రోగుల సంఖ్య, సాధించిన విజయాలను ప్రచారం చేసుకోకూడదు. ఇక బెస్ట్‌ డాక్టర్‌, నంబర్‌ వన్‌ డాక్టర్‌, నంబర్‌ వన్‌ స్పెషలిస్టు, వందశాతం సక్సెస్‌, గ్యారంటీడ్‌ క్యూర్‌, మిరాకిల్‌ ట్రీట్‌మెంట్‌, పెయిన్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌, ఒక్కరోజులో మటుమాయం అనే చికిత్స పేరుతో ప్రచారాలను మానుకోవాలి. అలాగే, రోగులను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, కూపన్లు, క్యాష్‌బ్యాక్‌, బహుమతులు, ఉచిత చికిత్సలు, రిఫరల్‌ ప్రయోజనాలు వంటి ప్రోత్సాహకాలను వాడుకోవద్దని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.

ఇక నుంచి ఇష్టానుసారంగా చేసే డిజిటల్‌ ప్రచారాలపై కఠిన నిబంధనలు

ఆంక్షలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎన్‌ఎంసీ హెచ్చరిక

ఎన్‌ఎంసీ నిబంధనలు ఉల్లంఘిస్తే వైద్యులపై చర్యలు తప్పవు. మొదటిసారి ఉల్లంఘిస్తే హెచ్చరికతో పాటు తప్పనిసరి నైతిక శిక్షణ పొందాల్సి ఉంటుంది. రెండోసారి మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. మూడోసారి అయితే 3 నుంచి 6 నెలలు రిజిస్ట్రేషన్‌ సస్పెన్షన్‌ చేస్తారు. అలాగే, తప్పుదోవ పట్టించే చికిత్స హామీలు, రోగులను ప్రోత్సాహకాలు, భారీ స్థాయిలో డిజిటల్‌ ప్రచారం చేసినట్లు రుజువైతే 6 నుంచి 12 నెలలు సస్పెన్సన్‌ విధించే అవకాశం ఉంది, పదేపదే ఉల్లంఘిస్తే 1 నుంచి 3 సంవత్సరాల పాటు వైద్య రిజిస్టర్‌ నుంచి తొలగించే చర్యలు తీసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement