సంక్షిప్త సమాచారం
కమలాపూర్ : మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఇన్‌స్పెక్టర్ పులిగిల్ల నవీన్ సూచించారు. మండలంలోని అంబాలలో శనివారం రాత్రి జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. యువత మత్తుకు బానిసై అనేక నేరాలకు పాల్పడుతున్నారన్నారు. మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై సమాచారం తెలిస్తే 1908 ద్వారా ట్రోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. జాగృతి కళాకారులు ఆటపాటలు, నాటికల ద్వారా రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, డయల్ 112, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవడం, సైబర్ నేరాలకు గురైనప్పడు వెంటనే 1930కు సమాచారం ఇవ్వడం, తదితర సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. ఎస్సై మధు, సర్పంచ్ కుమారస్వామి, జాగృతి కళాబృందం ఇన్‌చార్జ్, మహిళా ఏఎస్సై నాగమణి, హెడ్ కానిస్టేబుల్స్ విలియం, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ పూల్‌సింగ్, హోంగార్డ్స్ శ్రీనివాస్, విక్రమ్, రాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణను
రద్దు చేయాలి
ఆత్మకూరు : ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి తుప్పరి నర్సింహస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ సవరణ సాధనకై నేడు (ఆదివారం) హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని నీరుకుళ్లలో శనివారం వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. మాలలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం చేయాలన్నారు. సభకు మాలలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా నాయకులు ప్రభాకర్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రవికుమార్, లక్ష్మణమూర్తి పాల్గొన్నారు.
ఎంపీడీఓ కార్యాలయంలోనే ప్రజావాణి
వేలేరు : మండలస్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ఎంపీడీఓ కార్యాలయంలోనే నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ కిషన్ నాయక్ శనివారం ఒక ప్రకనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి రైతువేదికలో నిర్వహిస్తున్నామని, పరిపాలన సౌలభ్యం కోసం 5వ తేదీ (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఎంపీడీఓ కార్యాలయంలోనే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.
‘ఎవరినీ బెదిరించలేదు’
శాయంపేట : భూమి విషయంలో ఎవరిని బెదిరించలేదని కొత్తగుట్ట సింగారం గ్రామానికి చెందిన పోలెపల్లి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఎవరి భూమిని ఆక్రమించుకోలేదని, తనపై కర్రు లక్ష్మీ చేస్తున్న ఆరోపనలు అవాస్తమన్నారు. సర్వే నంబర్ 111కు బదులుగా సర్వే నంబర్ 113లో భూమి రిజిస్ట్రేషన్ అయ్యిందని, 113ను సరిచేస్తే భూమిని వారికి అప్పగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. లక్ష్మి, వారి కుటుంబ సభ్యులు పెట్టే ఇబ్బందులు భరించలేక గతంలో రెండెకరాల భూమిని కూడా విక్రయించానని చెప్పారు. తన భూమిలో సాగవుతున్న పంటను ధ్వంసం చేసి ఆ స్థలాన్ని గుడి నిర్మాణానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు వాస్తవాలను పరిశీలించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
నీట్ పీజీలో ఉత్తమ ర్యాంక్
పరకాల : నీట్ పీజీలో పరకాల పట్టణానికి చెందిన విద్యార్థిని ఆరెపల్లి పావన సుధ 6600 జాతీయ ఉత్తమ ర్యాంక్ సాధించింది. ప్రభు త్వ ఉపాధ్యాయుడు ఆరెపల్లి సుధాకర్–పద్మల కుమార్తె పావన సుధ ప్రభుత్వ మెడికల్ కళాశాల నిజమాబాద్‌లో ఎంబీబీఎస్‌లో చేరి వివిధ పోటీల్లో 6 పతకాలు సాధించింది. ప్రస్తుతం ప్రకటించిన నీట్ పీజీలో 6600 నేషనల్ ర్యాంక్ సాధించడంతో పలువురు అభినందించారు.


