భూపాలపల్లి: రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే ఓ ముఠాను భూపాలపల్లి పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. భూపాలపల్లి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సంపత్‌రావు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలోని సీఆర్ నగర్‌కు చెందిన మోటం శ్రీనివాస్‌కు మహారాష్ట్రలోని సిరొంచకు చెందిన రైస్‌మిల్ యజమాని వీరయ్య సేటుతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయాలని అనుకున్నారు. మూడు నెలల క్రితం భూపాలపల్లి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించారు. సదరు ఏజెంట్లు తక్కువ ధరకు రేషన్‌కార్డు లబ్ధిదారులనుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి సిరొంచలోని వీరయ్య సేటు రైస్‌మిల్లుకు తరలించి విక్రయించారు. ఇందుకు గాను ఏజెంట్ల బ్యాంకు ఖాతాల్లో అతను డబ్బు చేస్తాడు. ఈ దందాకు మోటం శ్రీనివాస్ పూర్తిస్థాయిలో అన్ని విధాలుగా సహకరిస్తున్నందుకు గాను సదరు ఏజెంట్లు తమకు వచ్చిన డబ్బులో నుంచి 10 శాతం కమీషన్ ఇస్తున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సుమారు 3,400 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు తమ విచారణలో వెల్లడైనట్లు డీఎస్పీ తెలిపారు. మోటం శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. ఏజెంట్లుగా వ్యవహరించిన బొమ్మ గణపతి (కాటారం), బంధం గౌరయ్య (కాటారం), బొమ్మ లక్ష్మిమనోహర్‌రెడ్డి (కాటారం), సుగ్గాల జనార్దన్‌రావు (మణుగూరు), గోండా లలిత (హనుమకొండ), రవి (కొత్తగూడెం), బుర్ర చక్రపాణి (మణుగూరు), రావుల శ్రీనివాస్ (మణుగూరు), గోకినపల్లి బేబీ(అశ్వాపురం), భూపాలపల్లికి చెందిన వారణాసి శ్రీనివాస్, హేమ నాగేంద్ర, నీలుగొండ రమేశ్, పవనపు రాజు, టేకం రాజబాబుపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. త్వరలోనే వీరిని కూడా అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. సీఐ శ్రీనివాస్, ఎస్సైలు,పోలీస్ సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.
● ప్రధాన నిందితుడి అరెస్ట్
● మరో 14 మంది ఏజెంట్లపై కేసు నమోదు


