కాశిబుగ్గ: అల్లోపతిక్ మాదిరిగా తమకూ స్టైఫండ్ చెల్లించాలని కోరుతూ నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఆయుష్ జేఏసీ నాయకులు తెలిపారు. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె ఆదివారం 20వ రోజుకు, రిలే నిరాహరదీక్ష 7వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. స్టైఫండ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అల్లోపతిక్‌తో సమానమైన స్టైఫండ్‌ను మంజూరు చేస్తూ వెంటనే జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని జేఏసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రోహిత్ బాస్రే ఆవేదన వ్యక్తం చేశారు.
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం చీఫ్ క్రూ కంట్రోలర్ (సీసీసీ)గా ఎండీ మౌలాషరీఫ్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. కాజీపేట సీసీసీగా పనిచేస్తున్న సాంబశివుడిని సికింద్రాబాద్ రైల్వే అధికారులు ఆన్‌లైన్ విధులకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో కాజీపేట రైల్వే డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మౌలాషరీఫ్‌ను అధికారులు కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయానికి సీసీసీగా బదిలీ చేశారు. కాగా, మౌలాషరీఫ్ గతంలో కాజీపేట, డోర్నకల్ సీసీసీగా పనిచేశారు.
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూజీఎం) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి.వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను పౌరులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
వరంగల్ కలెక్టరేట్‌లో
న్యూశాయంపేట: జిల్లా స్థాయిలో కలెక్టరేట్, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయం, మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. గ్రీవెన్స్‌లో అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
హనుమకొండ కలెక్టరేట్‌లో..
హన్మకొండ అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. కలెక్టరేట్, హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
కాజీపేట అర్బన్: కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన మాతంగి ప్రవీణ్ ప్రపంచ ఓపెన్ తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు. హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి ఇండోర్‌స్టేడియంలో కేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. సీనియర్ బ్లాక్‌బెల్ట్ అండర్ 54 వెయిట్ కేటగిరీలో ప్రవీణ్ ప్రతిభ కనబర్చి బంగారు పతకాన్ని సాధించాడు.
హసన్‌పర్తి : మండలంలోని మధుతండాలోని ఓ గోదాంలో 77.70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. తండాలోని ఓ గోదాంలో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా పెద్ద ఎత్తున బియ్యం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం విలువ సుమారు రూ.2,71,950 ఉంటుందని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ఈ బియ్యం వ్యాపారం చేస్తున్న నిరూప్ భూక్య తరుణ్ కుమార్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. దాడుల్లో ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఎస్సై వీరస్వామి సిబ్బంది పాల్గొన్నారు.


