సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు పంట మార్పిడికి మొగ్గు చూపుతున్నారు. లోటు వర్షపాతం, వరి కంటే తక్కువ నీటితో పండే పత్తి, పప్పుధాన్యాల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో సాధారణ సాగు అంచనాతో పోలిస్తే పత్తి, పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరగగా.. వరి 66.88 శాతానికే పరిమితమైంది. వ్యవసాయశాఖ విడుదల చేసిన వానాకాలం–2026 నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 15.93 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 13.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మొత్తం 85.78 శాతం సాగు పూర్తయ్యింది.
అంచనాలు మించిన పత్తి సాగు..
ఉమ్మడి వరంగల్‌లో సాధారణంగా 5,54,387 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా.. ఈసారి ఇప్పటికే 5,61,578 ఎకరాల్లో సాగైంది. అంటే సాధారణ అంచనాలో 101.30 శాతం మేర సాగు నమోదైంది. ముఖ్యంగా భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో పత్తి సాగు సాధారణ అంచనాలను మించింది. భూపాలపల్లిలో 98,764 ఎకరాల సాధారణ సాగుకు 1,09,442 ఎకరాల్లో పత్తి వేశారు. జనగామలో 1,37,145 ఎకరాల అంచనాకు 1,38,325 ఎకరాల్లో సాగు చేశారు. కాగా, సాధారణంగా 15,715 ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగవుతాయని అంచనా ఉండగా.. ఇప్పటికే 60,863 ఎకరాల్లో సాగయ్యాయి. వరి సాధారణంగా 9,21,445 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా కాగా 6,16,267 ఎకరాల్లో మాత్రమే సాగైంది. విస్తీర్ణంలో 66.88 శాతం మాత్రమే నమోదైంది.
మానుకోట ముందంజ
మొత్తం సాగు విస్తీర్ణం పరంగా మహబూబాబాద్ ముందు నిలిచింది. జిల్లాలో 3,71,318 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి 3,30,176 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణ అంచనాతో పోలిస్తే సాగు ప్రగతిలో భూపాలపల్లి 94 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత జనగామ 91 శాతం, మహబూబాబాద్ 89 శాతం, హనుమకొండ 85 శాతం, ములుగు 80 శాతం, వరంగల్‌లో 72 శాతం చొప్పున సాగు నమోదైంది.
వర్షపాతం లోటు, తక్కువ నీటి లభ్యత, ఎల్‌నినో ప్రభావంపై వ్యవసాయశాఖ చేపట్టిన అవగాహన సదస్సులు ఫలించాయి. అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు కంటే తక్కువ నీటితో సాగయ్యే పత్తి, పప్పుధాన్యాల వైపు రైతుల మొగ్గు చూపారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్‌సీడ్స్, పప్పుధాన్యాల పంటలు సాగు చేయాలని రైతులకు సూచించాం.
– దోమ ఆదిరెడ్డి, ఏడీఏ, హనుమకొండ
ఉమ్మడి జిల్లాలో 5,61,578 ఎకరాల్లో కాటన్ క్రాప్
వరి 6,16,267, పప్పుధాన్యాలు 60,863 ఎకరాల్లో సాగు
ఈసారి 15.93 లక్షలకు 13.66 లక్షల ఎకరాల్లో పంటలు
వర్షాభావ పరిస్థితులతో పంటమార్పిడికి రైతుల మొగ్గు


