మొదటి దశలో త్రితల రాతి నిర్మాణాల వరకు పూర్తి
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరాలయంలో రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టబోతున్న నవ పునర్నిర్మాణ తొలి దశ పనుల పూర్తికి వచ్చే ఏడాది మే నెల వరకు డెడ్‌లైన్ విధించినట్లు దేవాయశాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ధార్మికపరిషత్ సలహాదారు గోవిందహరితో కలిసి కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణ, తొలగింపు కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్‌ప్లాన్‌ను సమగ్రంగా వివరించారు. ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిలతో నిర్మాణం చేస్తున్నారు. విస్తరణ పూర్తయితే ఒకేసారి సుమారు 25 వేల మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉండి సౌకర్యవంతంగా దర్శనాలు చేసుకునేలా ప్రణాళిక రూపొందించారు.
రూ.60 కోట్లతో అష్ట తీర్థాలకు
ఘాట్లు, రహదారులు
సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి రూ.198 కో ట్లు మంజూరు చేశారని, అలాగే, కాళేశ్వరంలోని అ ష్ట తీర్థాల అభివృద్ధికి మరో రూ.60 కోట్లు కేటా యించినట్లు కమిషనర్ తెలిపారు. పక్షితీర్థం, వ్యాస తీర్థం, జ్ఞానతీర్థం తదితర తీర్థాలతోపాటు వివిధ ఘాట్ల నిర్మాణం, ఘాట్ నుంచి ఘాట్ వరకు పూర్తి స్థాయి రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
మొదటి దశలో..
మొదటి దశలో త్రితల (దక్షిణం, పడమర, ఉత్తరం ప్రాకారాలు మూడు అంతస్తులు స్లాబులు) ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణాలు పూర్తి చేస్తారు. ఆలయ నైరుతి, దక్షిణ భాగం నుంచి పనులు ప్రారంభించి గర్భాలయం పరిసరాలు, మిగతా పడమర, ఉత్తరం, దక్షిణ గోపురాలు స్లాబు వరకు పూర్తి చేస్తారు. ప్రాకారాలు, కొన్ని ఉప ఆలయాల నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు. తూర్పు గోపురం, ప్రాకారం మినహా ఇతర పనులను మొదటి దశలో పూర్తి చేస్తారు. గోదావరి పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 2027 మే నాటికి తొలి దశ నిర్మాణ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
నేటి నుంచి బాలాలయంలో దర్శనాలు..
అభివృద్ధి పనుల నేపథ్యంలో బుధవారం నుంచి శ్రీ కాళేశ్వరముక్తీశ్వరస్వామివారి దర్శనాలు నిలిపివేస్తారు. ప్రస్తుతం ప్రధాన ఆలయానికి కిలోమీటరు దూరంలోని బాలాలయమైన శ్రీ ఆదిముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనాలు కొనసాగుతాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ తెలిపారు.
అత్తికర్రతో ఉత్సవమూర్తులు..
బాలాలయంలో చిత్రపటాలు ఆసీనులు చేయకుండా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చైన్నై నుంచి అరుదుగా లభించే అత్తికర్రతో కాళేశ్వరముక్తీశ్వర లింగాలు, శుభానందాముక్తీశ్వరులు, సరస్వతి అమ్మవారు, ధ్వజస్తంభం తదితర మూర్తులను తయారు చేశారు. బుధవారం నుంచి ప్రత్యేక పూజలతో ఆసీనులు చేస్తారు.
జూన్‌లో కుంభాభిషేకం..
అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం వచ్చే ఏడాది జూన్ మాసంలో శృంగేరి పీఠాధిపతి ఆధ్వర్యంలో కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో దేవస్థాన ఈఓ ఎస్.మహేశ్, స్థపతి నాయక్, గ్రంథాలయ చైర్మన్ రాజబాపు, కాటారం ఆర్డీఓ వెంకటేశ్వర్లు, సర్పంచ్ మోహన్‌రెడ్డి, ఉపసర్పంచ్ సుధీర్, ధర్మకర్తలు సత్యనారాయణ, సీతయ్య, శ్యామ్, సీతారాం, దుర్గయ్య, అశోక్, పద్మ, రాజయ్య, ప్రశాంత్ రెడ్డి ,శ్రీధర్ రావు, ఎక్స్ ఆఫీషియో మెంబర్ ఫణీంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.
నేడు కళాపకర్షణ క్రతువు..
మంగళవారం సాయంత్రం వేదపండితులతో పంచబ్రహ్మ హోమం నిర్వహించారు. కాళేశ్వరాలయంలో బుధవారం ఉదయం 5 నుంచి 8గంటల వరకు ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు. 8.15 గంటలకు శృంగేరి పీఠాధిపతి శిష్య బృందంతో కళాపకర్షణ క్రతువు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కలశాలలో దైవికశక్తిని ఆహ్వానిస్తారు. బాలాలయంలో పూజలు చేసి ఉత్సవమూర్తులను ఆసీనులు చేస్తారు. ఇప్పటికే బాలాలయం వద్ద ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు.
నేటి నుంచి బాలాలయంలో దర్శనాలు
అరుదైన అత్తి కర్రతో తయారు చేసిన ఉత్సవ మూర్తులు
కాళేశ్వరాలయంలో పూజలు నిలిపివేత
దేవస్థానం అభివృద్ధికి భక్తులు
సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి


