సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి నంబర్లు అంగట్లో వేలంలా మారాయి. సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం లేకున్నా.. చేయి తడిపితే చాలు దరఖాస్తు చేసిన రోజుల వ్యవధిలోనే ఇంటి నంబర్ కేటాయిస్తూ కొందరు అధికారులు అందినకాడికి దండుకుంటున్నారు. విచిత్రమేంటంటే ఏ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం లేకున్నా.. మీ ఓపెన్ ప్లాట్‌లో రెడీమెడ్ కంటైయినర్ సిద్ధం చేసి ఉంచితే చాలు రోజుల వ్యవధిలో ఇంటి నంబర్లు కేటాయిస్తుండడం వివాదాస్పదమవుతోంది. అనంతరం ఆయా కంటైయినర్లకు ఇంటి పన్నుల రూపంలో వచ్చే పన్నులను సైతం కట్టకుండా ఉండేందుకు లోపాయికారీగా ఒప్పందం చేసుకొని మమ అనిపిస్తున్నారు. వీటిపై బల్దియాకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కమిషనర్ లేకపోవడం కూడా వారు ఆడిందే ఆట, పాడింది పాటగా మారింది. కొన్ని కేసుల్లో అక్రమ పద్ధతిలో పొందిన ఈ ఇంటి నంబర్లను ఆయా స్థల వివాదాల్లో కోర్టులో ఉపయోగించుకుంటుండడంతో అసలు ప్లాట్ల యజమానులకు ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతోంది. అన్ని అనుమతులు తీసుకొని నిర్మాణం పూర్తైన వాటికి ఇంటి నంబర్ కేటాయించేందుకు నెలల తరబడి తిప్పించుకుంటున్న కొందరు అధికారులు వీటి విషయంలో మాత్రం అడిగినంత డబ్బు చేతికి అందుతుండడంతో రోజుల వ్యవధిలో కేటాయిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇన్నాళ్లు ఓపెన్ ప్లాట్ల చుట్టూ గోడలు కట్టి ఓ చిన్న గది వేసుకుంటే ఎంతో కొంత తీసుకొని ఇంటి నంబర్ కేటాయించిన అధికారులు ఇప్పుడూ ఓపెన్ ప్లాట్లలో రెడీమెడ్ కంటైనర్లకు ఇంటి నంబర్లు కేటాయిస్తూ భారీగా అవినీతికి పాల్పడుతుండడం గమనార్హం.
మచ్చుకు కొన్ని..
హంటర్‌రోడ్డులోని ఓ పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న న్యూశాయంపేట జాగీరులోని ఓ సర్వే నంబర్‌లోని ఓపెన్ ప్లాట్‌లో కంటైనర్లు ఏర్పాటుచేసి ఇంటి నంబర్లు పొందారు. దేశాయిపేట నవయుగ కాలనీలో మున్సిపల్ లేఅవుట్ ఖాళీ స్థలం విషయంలో హైకోర్టులో కేసు నడుస్తుండగా కొత్తగా మళ్లీ ఇంటి నంబర్లు కేటాయించడం వివాదాస్పదమవుతోంది. అలాగే జక్కలొద్ది, మామునూరు, తిమ్మాపూర్, రంగశాయిపేట, దేశాయిపేట, పైడిపల్లి, ఉర్సు, భట్టుపల్లి తదితర ప్రాంతాల్లోనూ అక్రమ పద్ధతిలో ఇంటి నంబర్లు కేటాయించారనే ఉన్నతాధికారులకు ఫిర్యాదులొస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఈ అక్రమ పద్ధతిలో ఇంటి నంబర్ల కేటాయింపు అంశంపై బల్దియా అధికారులను ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
హంటర్ రోడ్డులో ఏర్పాటు చేసిన కంటైనర్
కంటైనర్ ఉంటే నంబర్ ఇచ్చుడే..
డబ్బుకు కక్కుర్తి పడి అక్రమ అనుమతులు
కొందరు బల్దియా అధికారుల చేతివాటంతోనే దందా
అసలు ఇంటి నిర్మాణదారుడికి చుక్కలే..


