హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయ సమీపంలోని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధనోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అర్చకుడు కేదారీశ్వరాచారి బ్రహ్మంగారి మూలమూర్తికి పంచామృతాభిషేకం, మేలుకొలుపు, పూజలు జరిపారు. వివిధ పుష్పాలతో చిత్రపటాన్ని ప్రతిష్ఠించి ఆవాహన, గణపతిపూజ, నవగ్రహపూజ, మంటపారాధన, ఆరాధన పూజాకార్యక్రమం నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాల వితరణ అక్షతాశీర్వాదాలు, అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మారేడోజు సదానందచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 111 సంవత్సరాల వయస్సు గల ఉత్తరాఖండ్‌కు చెందిన హిమాలయ యోగి సంతు సదానందగిరి స్వామీజీ, తెలంగాణ అర్యక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ నూతనంగా నిర్మించిన దేవాలయం కాలక్షేప మండపాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ భూత, భవిష్యత్, వర్తమాన కాలజ్ఞాన విషయాలను తెలియజేసిన గొప్ప వ్యక్తి బ్రహ్మంగారు సాక్షాత్తు విష్ణుస్వరూపుడని, కులమతాలకు అతీతంగా తన శిష్యులుగా స్వీకరించి మత సమరస్యాన్ని పాటించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గంగు ఉపేంద్రశర్మ, రామోజు జయసాగర్, బాలాజీ, రుద్రోజు సుగ్రీవచారి, పెందోట చక్రపాణి, చొల్లేటి కృష్ణమాచారి, పెంటయాచారి, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.


