ఆటాపాటల
మేళవింపు..
న్యూశాయంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ ఇప్పుడు మైనార్టీ గురుకులాల్లో కొత్త కాంతులు నింపుతోంది. కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, క్రీడా పటిమను వెలికి తీసేందుకు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టెమ్రిస్) నడుం బిగించింది. వేసవి సెలవులు, ప్రత్యేక విరామ సమయాలను వృథా చేయకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక క్రీడా సాంస్కృతిక శిబిరాలు (సమ్మర్ స్పెషల్ క్యాంపులు) విద్యార్థుల భవిష్యత్‌కు బలమైన పునాదులు వేస్తున్నాయి.
శిక్షణ శిబిరాల ప్రధాన ఉద్దేశం..
శిక్షణ శిబిరాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి వారిలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి నైపుణ్య వికా సానికి తోడ్పతాయి. క్రీడలతో క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వం అలవాటు పడుతుంది. సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగవుతాయి. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా మైదానాల్లో చెమట చిందించి, వేదికలపై తమ కళను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. చదువుతో పాటు ఆటాపాటల్లోనూ మేటి అని నిరూపించేందుకు వేదికలు గొప్ప అవకాశాలుగా మారుతాయి.
వసతులు–క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ
శిక్షణ శిబిరాల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రభుత్వం పౌష్టికాహారంతోపాటు ప్రత్యేక స్పోర్ట్స్ కిట్స్ అంది స్తుంది. ఎంపిక చేసిన రెండు కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ కోచ్‌లు, విషయ నిపుణులు క్షేత్ర స్థాయిలో శిక్షణ అందిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు శిబిరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కలెక్టర్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి, రీజినల్ లెవల్ కో–ఆర్డినేటర్, విజిలెన్స్ అధికారులు స్వయంగా క్యాంపులను సందర్శించి విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతులు, శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఒకే చోట చేరడం వల్ల వారిలో స్నేహ, సోదరభావం, ఐక్యత నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు.
టెమ్రిస్ ఆధ్వర్యంలో సమ్మర్ స్పెషల్ క్యాంపులు
క్రీడలు, సాంస్కృతిక తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ
ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహణ
ఉత్సాహంగా పాల్గొంటున్న ఉమ్మడి జిల్లాలోని 16 గురుకులాల విద్యార్థులు
రెండు గురుకులాల్లో సమ్మర్ ప్రత్యేక క్యాంపులు
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 16 గురుకుల పాఠశాలల నుంచి 5 నుంచి 8వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న 200 మంది బాలికలు, 200 మంది బాలురను ఎంపిక చేసి మొత్తం 400 మంది బాలబాలికలకు ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు 13 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. వరంగల్ జిల్లా పరిధిలోని రంగశాయిపేట శివారు జక్కలొద్ది వరంగల్(బీ1)లో 200 మంది బాలురకు, వరంగల్(జీ2) శంభునిపేట బాలికల గురుకులంలో మరో 200 మంది బాలికలకు భోజన, వసతులు కల్పించారు. వీరందరికీ క్రీడలు, సాంస్కృతిక అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులకు నిపుణులైన కోచ్‌ల పర్యవేక్షణలో అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఫుట్‌బాల్, క్రికెట్, కబడ్డీ, కరాటే, చెస్, కుంగ్ ఫూ, మార్షల్ ఆర్ట్స్‌తో పాటు మోటివేషన్ క్లాస్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి శిక్షణ అందిస్తున్నారు. శిక్షణలో ఎంపికై న విద్యార్థులను రాబోయే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయాలనే ప్రధాన ఉద్దేశంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్రీడలు, కళలు, విద్యను అనుసంధానిస్తూ ప్రభుత్వం చేపట్టిన ఈ చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
సమ్మర్ క్యాంపులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపుతాయి
సమ్మర్ క్యాంపులు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికితీయగానికి ఉపయోగపడుతాయి. క్రీడలు, కళలు, విద్యను అనుసందానిస్తూ ప్రభుత్వ చేపట్టిన చొరవ హర్షణీయం. క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దృఢత్వం పెరుగుతుంది. విరామ సమయం వృథా చేయకుండా వేసవి సెలవుల్లో నైపుణ్యాలను నేర్చుకుంటారు.
– మహ్మద్ హబీబుద్దీన్, క్రీడాభిమాని, రిటైర్ట్ లేబర్ ఆఫీసర్


