కేంద్రం నూతన చట్టాలను సవరించాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్రం నూతన చట్టాలను సవరించాలి

Apr 26 2026 2:03 AM | Updated on Apr 26 2026 2:03 AM

ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె. సత్యనారాయణ

కేయూ క్యాంపస్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె. సత్యనారాయణ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేయూలోని కెమిస్ట్రీ విభాగం సెమినార్‌హాల్‌లో శనివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ‘లా’ విద్యార్థుల కన్వెన్షన్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని, దీనిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదులుగా సమాజంలో ఏ విధంగా తమ బాధ్యతలు నిర్వర్తించాలనే అంశంపై కూడా వివరించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ ప్రైవేట్‌ ‘లా’ కళాశాలల్లో అధిక ఫీజులు నియంత్రించాలన్నారు. ప్రభుత్వ ‘లా’ కళాశాలల్లో మిగిలిపోతున్న సీట్లను కూడా భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అఽధ్యక్షుడు దామెర కిరణ్‌, రాష్ట్ర ‘లా’ కన్వీనర్‌ విఘ్నేష్‌, కోకన్వీనర్‌ రమ్య, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్‌ , కేయూ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీధర్‌కుమార్‌లోథ్‌ మాట్లాడారు. బాధ్యులు సహన, సంజన, భరత్‌ తదితరులు పాల్గొన్నారు. తొలుత ‘లా’ విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ బాధ్యులు క్యాంపస్‌లోని గెస్ట్‌హౌస్‌ నుంచి కెమిస్ట్రీ విభాగం వరకు ర్యాలీ నిర్వహించారు.

వడదెబ్బతో

మహిళా కూలీ మృతి

గీసుకొండ: వడదెబ్బతో వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన ఎండీ యాకూబీ(65) మృతి చెందింది. యాకూబీ శుక్రవారం గ్రామంలో మిరప తొడిమెలు ఏరడానికి వెళ్లి అస్వస్థతకు గురై ఇంటికి వెళ్లింది. శనివారం ఉదయం విరేచనాలు అయ్యి నీరసించింది. దీంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని గ్రామస్తులు, మృతురాలు బంధువులు తెలిపారు. కాగా, సర్పంచ్‌ రడం భరత్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు మృతురాలి కుటుంబానికి రూ. 10 వేల సాయం అందించారు.

మర్రిపల్లిగూడెంలో వృద్ధుడు..

కమలాపూర్‌: హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండంలం మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన సాదుల నరహరి (65) వడదెబ్బతో మృతి చెందాడు. నరహరి గత శుక్రవారం మోదుగ ఆకుల (విస్తరి ఆకులు) సేకరణ కోసం గ్రామ శివారులోకి వెళ్లి వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. శనివారం మరోసారి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీకుల సమాచారం మేరకు 108 సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికే మృతి చెందాడని గ్రామస్తులు, బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement