హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు శుక్రవారం ఉధృతంగా సాగింది. వరంగల్ రీజియన్ వ్యాప్తంగా 8 డిపోల పరిఽధి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నర్సంపేట డిపో డ్రైవర్ కోలా శంకర్‌గౌడ్ ఆత్మహత్య చేసుకోగా.. ఆర్టీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో విద్యుత్ బస్సులతో పాటు ప్రైవేట్ అద్దె బస్సులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. శంకర్‌గౌడ్ మృతి నేపథ్యంలో బస్సులు నడిపితే కార్మికులను రెచ్చగొట్టినట్లవుతుందని, బస్సులకు నష్టం చేకూరే అవకాశం ఉంటుందని భావించిన ఆర్టీసీ అధికారులు వరంగల్ రీజియన్ వ్యాప్తంగా సంస్థ బస్సులతో పాటు విద్యుత్, ప్రైవేట్ అద్దె బస్సులను నిలిపేశారు. దీంతో బస్సులు నడుస్తాయని హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు గంటల కొద్ది నిరీక్షించి కొందరు తిరిగి ఇళ్లకు వెళ్లగా, మరికొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.
అమాంతం డబుల్..
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బస్సులు నిలిచిపోవడంతో ప్రైవేట్ వాహనదారులు రెచ్చిపోయారు. అధిక చార్జీల పేరిట ప్రయాణికుల నుంచి వసూలు చేశారు. విచ్చలవిడిగా వసూళ్లతో ప్రయాణికులను జేబులకు చిల్లు పెట్టారు. ఆటోవాలాలు సైతం పొరుగు నగరాల వరకు ప్రయాణికులను చేరవేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హనుమకొండ నుంచి జగిత్యాల వరకు ఆటోలో ప్రయాణికులను చేరవేర్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రయాణికులు కూడా తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రయాణ వనరుల్ని వినియోగించుకుంటున్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోయారు. సమ్మె జరిగిన బుధ, గురువారాల్లో స్వల్పంగా బస్సులు నడిచాయి. బంద్ నేపథ్యంలో శుక్రవారం బస్సులు పూర్తిగా నిలిపేయడంతో ప్రైవేట్ వాహనదారుల పంట పండింది. హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు రూ.350 తీసుకునే ప్రైవేట్ కార్లు రూ.500 వరకు వసూలు చేశారు. హనుమకొండ నుంచి ఏటూరునాగారానికి ఎక్స్‌ప్రెస్‌కు రూ.180, మంగపేటకు రూ.200 కాగా, ప్రైవేట్ వాహనదారులు రూ.400 వసూలు చేసినట్లు ప్రయాణికులు తెలిపారు. అధిక చార్జీలు వసూలు చేస్తుండడంతో ఉచిత ప్రయాణం చేద్దామని వచ్చిన మహిళా ప్రయాణికులు ఖంగుతిన్నారు. కొన్ని రూట్లలో ప్రైవేట్ వాహనాలు సైతం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు.
రెట్టింపు చార్జీలు వసూలు
ప్రయాణికుల జేబులకు చిల్లు
మూడోరోజు కొనసాగిన ఆర్టీసీ సమ్మె
కదలని ప్రగతి రథ చక్రాలు.. డిపోల వద్ద కార్మికుల ధర్నా


