కేంద్ర మంత్రి రాకతో వేడెక్కిన ముత్తోజిపేట | - | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి రాకతో వేడెక్కిన ముత్తోజిపేట

Apr 25 2026 7:12 AM | Updated on Apr 25 2026 7:12 AM

కేంద్ర మంత్రి రాకతో వేడెక్కిన ముత్తోజిపేట

కేంద్ర హోంశాఖ సహాయ శాఖమంత్రి బండి సంజయ్‌ మధ్యాహ్నం ఒంటిగంటకు ముత్తోజిపేటకు చేరుకుని శంకర్‌గౌడ్‌ మృతదేహానికి నివాళులర్పించారు. అనంత రం శంకర్‌ భార్య లత, కుమారుడు హేమంత్‌, కూతురు, అల్లుడిని పరామర్శించారు. తనవంతు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. శంకర్‌ మృతదేహా న్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించిన తర్వాత ముత్తోజిపేటకు తీసుకొస్తామని బతిమిలాడినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు, కార్మికులు మంత్రికి విన్నవించారు. వెంటనే ఆయన పోలీసులతో మాట్లాడారు. డిపో వద్దకు మృతదేహాన్ని తరలించాలని కార్యకర్తలకు సంజయ్‌ సూచించడంతో ఫ్రీజర్‌లో ఉన్న శంకర్‌ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలో ఫ్రీజ ర్‌ బాక్స్‌పైన గ్లాస్‌ మూత పగిలిపోయింది. ఫ్రీజర్‌బాక్స్‌ను సుమారు 500 నుంచి 600 మీటర్ల దూరం వరకు కార్యకర్తలు ఒక్కసారిగా లాక్కొని రావడంతో ఒక్కసారిగా ముత్తోజిపేటలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది.

అనుమతించని పోలీసులు..

మృతదేహాన్ని తీసుకెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బీజేపీ కార్యకర్తలు పక్కకు తోసేశారు. సుమారు గంటపాటు మృతదేహం ఎండలోనే ఉండిపోయింది. డిపో వద్ద ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటామని బండి సంజయ్‌ హామీ ఇచ్చినా పోలీసులు అనుమతివ్వలేదు. ఒక అంబులెన్స్‌ తీసుకొచ్చి మృతదేహాన్ని ఎక్కించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ వచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మంత్రి కారు దిగి పక్కనే ఉ న్న ఇంటి రేకుల కిందకు వెళ్లిపోయారు. వెంటనే పోలీసులు మృతదేహం, కుటుంబ సభ్యులను ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఉత్కంఠ మధ్యాహ్నం 3.40 గంటల వరకు కొనసాగింది. పోలీసులు నచ్చజెప్పడంతో బండి సంజయ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి శ్రీధర్‌, నాయకులు రావు పద్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం 6 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కాగా.. 7.30 గంటలకు అంత్యక్రియలు ముగిశాయి. కాగా, శంకర్‌ గౌడ్‌ భార్య లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement