సర్కారు నిర్లక్షమే కారణం
కాశిబుగ్గ: నర్సంపేటలో ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్‌ను చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో శంకర్‌గౌడ్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. శంకర్‌గౌడ్ ఆత్మహత్యాయత్నం సమాచారం తెలుసుకున్న జేఏసీ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున ఎంజీఎం చేరుకున్నారు. ముందుగానే కలెక్టర్ సత్యశారద క్యాజువాలిటీకి చేరుకుని వైద్యులను అప్రమత్తం చేశారు. మరోవైపు పలు పార్టీల నాయకులు, బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఎంజీఎం చేరుకున్నారు. దీంతో క్యాజువాలిటీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సీపీ సన్‌ప్రీత్ సింగ్ కూడా సిబ్బందితో విచ్చేసి పరిస్థితిని సమీక్షించారు. అప్పటికే పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌తోపాటు సీపీ బాధితుడి వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పలు పార్టీల నాయకులు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శంకర్‌ను ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మరోపక్క జేఏసీ నాయకులు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలను నిరసించారు. రేపటి నుంచి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ ఘటనకు
సర్కారు బాధ్యత వహించాలి
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ ఘటనకు సర్కారే బాధ్యత వహించాలని మాజీ మంత్రి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా సర్కారు బోగస్ మాటలు మాట్లాడుతోందన్నారు. దీనివల్ల కార్మికులు జీవితాలు ఆగమైపోతున్నాయని మండిపడ్డారు. ఎంజీఎంకు తీసుకొచ్చిన శంకర్ గౌడ్‌ను పరామర్శించిన అనంతరం వారు మాట్లాడారు. ‘నా వాళ్ల కోసం నేను పెట్రోల్ పోసుకున్నా’ అని శంకర్ గౌడ్ చెప్పడం బాధ కలిగించిందన్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న శంకర్ గౌడ్ కోరికల తీర్చితే వాటిని విని ఆయన బతుకుతాడన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం దిగొచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆత్మహత్యకు పాల్పడొద్దు..
కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడొద్దని సీపీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. ఈ సమయంలో ఏమైనా జరిగితే తమ కుటుంబం రోడ్డు పాలవుతుందన్నారు. ప్రభుత్వం కూడా కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతుందన్నారు.
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్
తరలించాం
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్‌కు మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించామని కలెక్టర్ సత్యశారద చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ప్రశాంతంగా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దన్నారు.
60 నుంచి 80 శాతం గాయాలు..
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌కు 60 నుంచి 80 శాతం గాయాలయ్యాయని ఆర్‌ఎంఓ అశ్విన్‌కుమార్ తెలిపారు. నర్సంపేట ఆస్పత్రి నుంచి సాయంత్రం 5.10 గంటలకు ఎంజీఎం వచ్చారని, వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశామని తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపించామన్నారు.
ప్లకార్డులతో ఎంజీఎం వద్ద ఆర్టీసీ కార్మికుడు
ప్రత్యేక అంబులెన్స్‌లో
శంకర్‌గౌడ్ తరలింపు
ఎంజీఎం వద్దకు తరలివచ్చిన
కార్మికులు, నేతలు
ముందుగానే చేరుకున్న కలెక్టర్
సత్యశారద, సీపీ సన్‌ప్రీత్ సింగ్
సర్కారు నిర్లక్ష్యంతోనే ఘటన
జరిగిందని ప్రతిపక్షాల మండిపాటు
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ ఒంటికి నిప్పటించుకున్నాడని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి డిమాండ్లు పరిష్కరించుకుందామన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామన్నారు.


