నిధుల కేటాయింపులేవి? | - | Sakshi
Sakshi News home page

నిధుల కేటాయింపులేవి?

Apr 24 2026 5:44 AM | Updated on Apr 24 2026 5:44 AM

జీతాలు లేక సిబ్బంది పరేషాన్‌

న్యూశాయంపేట : తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూకు రెండో అధికార భాషా హోదా కల్పించినా క్షేత్రస్థాయిలో ఆ భాషా వికాసానికి తోడ్పడే సంస్థలు మాత్రం నిర్వేదంలో ఉన్నాయి. ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నడుస్తున్న రెండు కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాలు, లైబ్రరీలు కొన్నేళ్లుగా నిధులు నిలిచిపోవడంతో దీనస్థితికి చేరుకున్నాయి. అధికారికంగా ప్రాధాన్యం ఉన్నా నిధుల కేటాయింపులో చూపుతున్న వివక్ష ఉర్దూ భాషా అభిమానుల భవిష్యత్‌ అంధకారంలో నెడుతోంది.

పనిచేయని కంప్యూటర్లు..

మైనార్టీ యువతకు సాంకేతిక పరిజ్ఞానం అందించి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉర్దూ అకాడమీ ద్వారా కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాలను ఏర్పాటుకు సంకల్పించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండు సెంటర్లు మంజూరు చేశారు. ఒకటి వరంగల్‌లో రెండోది హనుమకొండలో ఏర్పాటు చేశారు. దీంతో పాటు హనుమకొండ రాయపురలో లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు. మహోన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ సెంటర్లు ఇప్పుడు షో–పీస్‌లుగా మారాయి. కేంద్రాల్లో కంప్యూటర్లు పాతపడి మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదు. ఆధునిక సాఫ్ట్‌వేర్‌ పక్కన పెడితే కనీసం అప్‌డేట్‌ చేయడానికి కూడా నిధులు లేకుండా పోయాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెలవెలబోతున్న లైబ్రరీలు..

విజ్ఞాన కేంద్రాలుగా విరాజిల్లాల్సిన లైబ్రరీలు నిధు ల లేమితో వెలవెలబోతున్నాయి. పుస్తకాల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఉర్దూ విద్యార్థులకు అవసరమైన కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకాలు రావడం నిలిచిపోయాయి. అద్దెలు చెల్లించలేక, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో లైబ్రరీల నిర్వహణ భారంగా మారింది. రెండో అధికార భాష పరిరక్షణ అంటే కేవలం జీఓలకు పరిమితం కాకూడదని విద్యార్థులు పేర్కొంటున్నారు.

కాగితాలకే పరిమితమైన ఉర్దూ హోదా

రెండో అధికార భాషకు నిధుల గ్రహణం

డబ్బులు లేక మూతబడుతున్న

కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాలు

లైబ్రరీల పరిస్థితి దయనీయం

సర్కారు నిర్లక్ష్యంపై మైనార్టీల ఆగ్రహం

కంప్యూటర్‌ సెంటర్లలో పనిచేసే సిబ్బందికి, ఇన్‌స్ట్రక్టర్లకు నెలల తరబడి వేతనాలు అందడం లేదు. రెండో భాష వికాసంలో భాగస్వాములు అవుతున్నామని సంబురపడాలో లేక పస్తులుండాలో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. పదేళ్లుగా కేంద్రాలకు సరైన భవనాలు లేక అద్దెభవనాలకు కిరాయిలు కూడా చెల్లించకపోవడంతో యజమానులు ఖాళీ చేయాలంటున్నారని సిబ్బంది తెలిపారు. ఐదు,ఆరు సంవత్సరాలుగా శిక్షణ కేంద్రాలను మూసివేసి ఇన్‌స్ట్రక్టర్లు, సిబ్బందిని మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయాలకు వెళ్లాలని అకాడమీ అధికారులు ఆదేశాలు జారీ చేయగా తాత్కాలికంగా వస్తూ పోతు కాలం గడుతున్నారు. కానీ మళ్లీ కొన్ని రోజుల క్రితం అధికారులు మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో పనిచేయడానికి వీలు లేదని ప్రభుత్వ భవనాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు రావడంతో ఎక్కడ ఉండాలో.. ఎక్కడ పనిచేయాలో తెలియక సతమతమవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement