ఖిలా వరంగల్: డబ్బు కోసం స్నేహితుడే నమ్మించి ప్రాణం తీసిండు. ఇటీవల సంచలనం సృష్టించిన బిహార్ కార్మికుడి హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు గురువారం వరంగల్ మిల్స్‌కాలనీ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్ వివరాలు వెల్లడించారు. బిహార్‌లోని సలర్పూర్ థానా గ్రామానికి చెందిన ఎండీ తాన్వీర్ ఆలం ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం వరంగల్ వచ్చి రామన్నపేటలో ఉంటూ కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుల ఒత్తిడి కారణంగా డబ్బులు సమకూర్చుకోవాలని యత్నిస్తున్న క్రమంలో వరంగల్ అండర్ బ్రిడ్జి సమీపంలోని ఓ వైన్‌షాపు వద్ద నిందితుడికి బిహార్‌కు చెందిన దూరిషా (60)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని నిందితుడు స్నేహంగా మార్చుకున్నాడు. దూరిషా వద్ద డబ్బు ఉందని గమనించి చోరీ చేయాలని పథకం రచించాడు. ఇందులో భాగంగా ఈనెల 18న వరంగల్ శంభునిపేట దూపకుంటరోడ్డులోని బుడిగజంగాల కాలనీలో దూరిషా అద్దెకుంటున్న గదికి వెళ్లి ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అనంతరం దూరిషా నిద్ర పోతున్న సమయంలో అతడి వద్ద ఉన్న నగదును చోరీ చేయడానికి యత్నించాడు. ఈ సమయంలో దూరిషా మేల్కోని ప్రతిఘటించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ సమయంలో తనపై కేసు నమోదవుతుందనే భయంతో తాన్వీర్ ఆలం అక్కడే ఉన్న కత్తితో దూరిషా గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం రూ.4,500 నగదు తీసుకుని పరారయ్యాడు. ఆ తర్వాత శంభునిపేట జంక్షన్ నుంచి నేరుగా రామన్నపేటలోని అద్దె గదికి చేరుకున్నాడు. చోరీ చేసిన డబ్బును ఖర్చు చేశాడు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులు సాంకేతిక ఆధారాల సహకారంతో నిందితుడిని శంభునిపేట జంక్షన్ వద్ద గురువారం ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ రమేశ్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు నరేశ్, శ్రవణ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ నరేందర్, ఎండీ వాజీద్‌పాషా, ప్రవీణ్‌రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
డబ్బు కోసమే కార్మికుడి దారుణ హత్య
నిందితుడి అరెస్ట్, రిమాండ్
వివరాలు వెల్లడించిన ఇన్‌స్పెక్టర్ రమేశ్


