ధరిత్రి సంరక్షణలో భాగస్వాములవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ధరిత్రి సంరక్షణలో భాగస్వాములవ్వాలి

Apr 23 2026 8:18 AM | Updated on Apr 23 2026 8:18 AM

ధరిత్రి సంరక్షణలో భాగస్వాములవ్వాలి

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: భూమిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో తెలంగాణ నేషనల్‌ గ్రీన్‌ కార్ప్స్‌, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న ‘ఇంటర్నేషనల్‌ మదర్‌ ఎర్త్‌ ఫోర్ట్‌ నైట్‌’ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. పక్షం రోజుల పాటు జరుగుతున్న మదర్‌ ఎర్త్‌ ఉత్సవాల సందర్భంగా విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సైకిల్‌ ర్యాలీలు, ఉదయం నడక నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్‌. వెంకట గిరిరాజ్‌గౌడ్‌, డీపీఆర్‌ఓ అయూబ్‌ అలీ, ‘కుడా’ ప్లానింగ్‌ అధికారి అజిత్‌రెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి, ఏజీసీ కన్వీనర్‌ ఎస్‌.శ్రీనివాసస్వామి, ప్లానింగ్‌ కో–ఆర్డినేటర్‌ మహేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించాలి

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

కాళోజీ సెంటర్‌: సహజవనరులను వినియోగించుకుని పర్యావరణాన్ని పరిక్షించాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. ఇంటర్నేషనల్‌ మదర్‌ ఎర్త్‌డేను పురష్కరించుకొని ఈనెల 15 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో తెలంగాణ నేషనల్‌ గ్రీన్‌క్రాప్స్‌ వారి పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ భూమిని సంరక్షించడంలో పర్యావరణ సమతుల్యత ఎంతో కీలకమన్నారు. అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ 50 మొక్కలు నాటాలని కోరారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇంటింటికి ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకుంటే భూగర్భజలాలు పెరుగుతాయని తెలిపారు. అదనపు కలెక్టర్‌ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఈఓ బి.రంగయ్య నాయుడు, జిల్లా సైన్స్‌ అధికారి డాక్టర్‌ కట్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement