గూడూరు: వడదెబ్బతో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండకు చెందిన పుల్పం ఎల్లమ్మ (48) మృతి చెందింది. గ్రామానికి చెందిన ఓ రైతు మిరప తోటలో పనికి వెళ్లిన ఎల్ల మ్మ అక్కడ వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైంది. దీంతో సహ కూలీలు బాధితురాలిని ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. మృతురాలి కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.గిరిధర్‌రెడ్డి తెలిపారు.
ఖిలా వరంగల్: వడదెబ్బతో అస్వస్థతకు గురైన ఓ యువకుడు ఎంజీఎంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వరంగల్ లేబర్ కాలనీ 100 ఫీట్ల రోడ్డుకు చెందిన సింగారపు రాకేశ్ (25) తొర్రూరులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఆర్‌ఓగా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత పని నిమిత్తం ఈనెల 20న నర్సంపేట వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. భోజనం చేసిన అనంతరం అస్వస్థతకు గురికాగా కుటుంబీకులు వెంటనే ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి చిరంజీవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు.


