న్యూస్‌రీల్
నేటి నుంచి వరంగల్ రీజియన్ వ్యాప్తంగా
నిలిచిపోనున్న బస్సులు
ప్రయాణికుల కోసం
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
హన్మకొండ: సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి మొదటి బస్సు నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిర్ణయం తీసుకుంది. దీంతో బుధవారం ఉదయం నుంచి వరంగల్ రీజియన్‌లోని 8 డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వరంగల్ రీజియన్‌లో మొత్తం 1,036 బస్సులు సేవలు అందిస్తున్నాయి. ఇందులో 596 సంస్థ బస్సులు, 325 ప్రైవేట్ అద్దె బస్సులు, 115 విద్యుత్ బస్సులు ఉన్నాయి. మొత్తం 986 షెడ్యూల్స్ నడుస్తున్నాయి. రోజుకు 4.11 లక్షల కిలోమీటర్లు తిరిగి 4.16 లక్షల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేరవేస్తూ రూ.2.06 కోట్ల ఆదాయాన్ని పొందుతుంది. సంస్థకు చెందిన 1,123 మంది డ్రైవర్లు, 1,436 మంది కండక్టర్లు సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ విధానంలో 140 మంది డ్రైవర్లు, 286 మంది కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా సంస్థ ఉద్యోగులైన 368 మెకానిక్‌లు, 250 మంది ట్రాఫిక్ సూపర్వైజర్లు, కార్యాలయం సిబ్బంది 60 మంది, సెక్యూరిటీ సిబ్బంది 44 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఔట్ సోర్సింగ్ విధానంలో కొనసాగుతున్న 140 మంది డ్రైవర్లు, 286 మంది డ్రైవర్లు మినహా మిగతా వారంతా సమ్మెలోకి వెళ్లనున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో 104 మంది మెకానిక్‌లు, కార్యాలయ స్టాఫ్ 38 మంది. సెక్యూరిటీ 36 మంది ఉన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరయ్యే అవకాశలున్నాయి. వీరితో బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్–2 డిపోలో 115 విద్యుత్ బస్సులున్నాయి. ఇవి పూర్తిగా ప్రైవేట్ డ్రైవర్లతో నడుస్తున్నాయి. వీటితోపాటు మరో 325 ప్రైవేట్ అద్దె బస్సులున్నాయి. విద్యుత్ బస్సులు, ప్రైవేట్ అద్దె బస్సులు తిప్పడంతో పాటు, సంస్థ బస్సులను తిప్పేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉన్నంతలో కనీసం ప్రధాన రూట్లలో బస్సులు నడిపేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సగటున రోజుకు 4.16 లక్షల మంది ప్రయాణం
రోజుకు 4.11 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్న బస్సులు
సంస్థ పరిరక్షణ ముఖ్యం
ఆర్టీసీ కార్మికులుగా సంస్థ పరిరక్షణ కోసం కృషి చేస్తాం. కార్మికుల ప్రయోజనాలు, సంస్థ కోసమే సమ్మెకు వెళ్తున్నాం. విద్యుత్ బస్సులు తీసుకువచ్చి సంస్థను ప్రైవేట్‌పరం చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఆర్టీసీకే విద్యుత్ బస్సులు ఇవ్వాలి. యాజమాన్యం, ప్రభుత్వం ముందుంచిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.
శ్రీనివాస్, ఎంప్లాయీస్ యూనియన్ రీజియన్ సెక్రటరీ
డిమాండ్లు పరిష్కరించాలి
సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. సమ్మెకు ఒక రోజు ముందు చర్చల పేరుతో కాలయాపన చేయాలని చూస్తోంది. ముందుగా డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పీఆర్సీ అమలు చేయాలని, పనిభారం తగ్గించాలి. ఎరియర్స్ ఇవ్వాలి. పని గంటలు తగ్గించాలి. ఔట్ సోర్సింగ్ విధానం తగ్గించి సంస్థ నియామకాలు చేపట్టాలి.
– రాంచందర్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు


