హన్మకొండ: ఆర్టీసీలో అద్దె బస్సుల స్కీం కొనసాగించాలని ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్ కోరారు. హనుమకొండ హంటర్‌రోడ్డులోని అభిరాం గార్డెన్స్‌లో ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ రీజియన్ స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో లక్కం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులు 25 సంవత్సరాలుగా ఆర్టీసీలో అద్దె బస్సులు నడుపుతూ ఉపాధి పొందుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్టీసీలకు అనుసంధానంగా 0.033 వాహనాలు నడుస్తున్నాయన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతూ నిరుద్యోగుల పొట్ట కొట్టాలని చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాలుష్యం నివారణ పేరుతో ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడితే సరిపోదని, ఇతర వాహనాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆర్టీసీ హైర్‌బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బ మధుకర్‌రెడ్డి మాట్లాడుతూ 2007, 2009 బస్సుల స్థానంలో రిప్లేస్‌మెంట్ బస్సులను ఇవ్వాలని, డిపో మేనేజర్లతో ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆర్‌ఎం కార్యాలయంలో సంయుక్త సమావేశం నిర్వహించాలని యాజమాన్యాన్ని కోరారు. అసోసియేషన్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు మారిపల్లి రాంరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు బాలవర్ధన్‌రెడ్డి, ఎన్.ప్రసాద్, హబీబ్, జె.వెంకట్‌రెడ్డి, కె.సదానందం, ఎండి పర్వేజ్, జి.వెంకన్న, కె.భాస్కర్‌రెడ్డి, కుమార్, బి.రామలింగారెడ్డి పాల్గొన్నారు.
ఆర్టీసీ హైర్‌బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు లక్కం ప్రభాకర్


