● ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు
వరంగల్ క్రైం: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ప్రమాదం జరిగిన గంటలోపు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తే బతికే అవకాశాలు అధికమని ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌రావు తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్ అలైవ్’రోడ్డు భద్రతా కార్యక్రమంలో 5వ రోజు రోడ్డు ప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనపై ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభాకర్‌రావు మాట్లాడారు. అనంతరం వైద్యులు సీపీఆర్ చేయడంపై వివరించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రాహ్–వీర్’పథకం, ‘పీఎం రాహత్’పథకాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిబ్బందికి అధికారుల చేతుల మీదుగా కూలింగ్ గ్లాసులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏసీపీలు సత్యనారాయణ, నర్సింహారావు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, సుజాత, ఇన్‌స్పెక్టర్ శివకుమార్ , సిబ్బంది పాల్గొన్నారు.


