వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

Apr 18 2026 7:17 AM | Updated on Apr 18 2026 7:17 AM

వరంగల్‌ క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, నిత్యం తాగి ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే నెపంతో రూ.5లక్షలు సుఫారీఇచ్చి భర్తను హత్య చేయించింది ఓభార్య. ఈ ఘటనకు సంబంధించి ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌ శుక్రవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈనెల 8న పరకాలకు చెందిన మడికొండ సాంబయ్య తన కుమారుడు మడికొండ సుమన్‌ భరత్‌ (38) కనిపించడం లేదని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మడికొండ సుమన్‌ భరత్‌కు 2012 సంవత్సరంలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాములపల్లికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అనంతరం లావణ్యకు పరకాల పట్టణంలోని ఇమ్మడి నరేశ్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ విషయంలో మడికొండ సుమన్‌ భరత్‌ రోజు తాగి వచ్చి లావణ్యను హింసించేవాడు. దీంతో లావణ్య తన తమ్ముడు పెండల రాజు, ప్రియుడు ఇమ్మడి నరేశ్‌తో కలిసి సుమన్‌ భరత్‌ను హత్య చేయడానికి ప్లాన్‌ వేసింది. దీంతో ప్రియుడు ఇమ్మడి నరేష్‌కు పరిచయం ఉన్న గోవిందరావుపేటకు చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లతో హత్యకు బేరం కుదుర్చుకున్నారు.

బంగారం కుదువపెట్టి సుపారీ ఇచ్చి..

లావణ్య తన బంగారం కుదువ పెట్టి రూ.1,59,000, ఇమ్మడి నరేశ్‌, పెండల రాజు కలిసి రూ.3లక్షలు పోగు చేసి మొత్తం రూ.4,59,000 చిరంశెట్టి వెంకటేశ్వర్లుకు ఇచ్చి సుమన్‌భరత్‌ను హత్య చేయించారు. వెంకటేశ్వర్లు మరో వ్యక్తి భూక్య రాకేశ్‌తో కలిసి సుమన్‌ భరత్‌కు మద్యం, డబ్బులు ఆశ చూపి ఈనెల 3న రాత్రి 8 గంటలకు ములుగుకి పిలిపించారు. అక్కడినుంచి చిరంశెట్టి వెంకటేశ్వర్లు వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి సుమన్‌ భరత్‌కి మద్యం తాగించారు. అతను మత్తులో లేవలేని స్థితిలో ఉండగా చిరంశెట్టి వెంకటేశ్వర్లు బీర్‌ బాటిల్‌తో భరత్‌ తల వెనక భాగంలో కొట్టగా సుమన్‌ భరత్‌ పడిపోయాడు. అనంతరం వారు ముందే తెచ్చి పెట్టుకున్న పెట్రోల్‌ భరత్‌ ఒంటిపై పోసి నిప్పంటించారు. భరత్‌ మృతదేహం కాలుతుండగా.. భూక్యా రాకేశ్‌, చిరంశెట్టి వెంకటేశ్వర్లు ఫోన్లో ఫోటోలు, వీడియో తీసి, మరుసటి రోజు ములుగుకు వచ్చిన లావణ్య, పెండల రాజుకు చూపించారు. దీంతో సుఫారీలో మిగిలిన డబ్బులను వారు అప్పగించారు. అనంరతం లావణ్య తన అత్తగారి ఇల్లు అయిన పరకాలకి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉంది. ఈనెల 5న చిరంశెట్టి వెంకటేశ్వర్లు రాత్రి 10 గంటలకు పొలం వద్దకు వెళ్లి భరత్‌ కాలిపోగా మిగిలిన ఎముకలను పక్కనే ఉన్న వాగులో పడేశాడు. దర్యాప్తులో భాగంగా పరకాల పోలీసులు చిరంశెట్టి వెంకటేశ్వర్లు, భూక్య రాకేశ్‌ను గోవిందరావుపేట శివారులోని చిరంశెట్టి వెంకటేశ్వర్లు వ్యవసాయ భూమి వద్దకు తీసుకెళ్లి కాల్వలోని భరత్‌ ఎముకలు, బూడిద, కాలిచ్చి పడేసిన సిగరెట్‌ పికలు, బీర్‌ బాటిల్‌ ముక్కలు, మందు బాటిళ్ల మూతలు, ప్లాస్టిక్‌ ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. హత్య కేసును చేధించి నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన పరకాల ఏసీపీ సతీష్‌బాబు, ఇన్‌స్పెక్టర్‌ క్రాంతికుమార్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌నాయక్‌ను డీసీపీ అంకిత్‌ కుమార్‌ అభినందించారు.

భర్తను హత్య చేయించిన భార్య

హత్యకు రూ.5 లక్షల సుపారీ

ప్రియుడు, తమ్ముడితో కలిసి హత్యకు ప్రణాళిక

మృతదేహాన్ని దహనం చేస్తూ వీడియో తీసిన నిందితులు

వివరాలు వెల్లడించిన ఈస్ట్‌ జోన్‌ డీసీపీ

Advertisement
 
Advertisement
Advertisement