కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్న డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ రెండు, నాలుగు, ఐదు, ఆరో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్‌లో జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు శుక్రవారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌కు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి తీవ్రత అధికంగా ఉందని, దీంతో ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ తదితర చోట్ల వివిధ గ్రామీణ ప్రాంతాలనుంచి విద్యార్థులు 25 కిలోమీట్లర్ల నుంచి 50 కిలోమీటర్లవరకు పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాయాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని రిజిస్ట్రార్ రామచంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలున్నాయని విద్యార్థులు పరీక్షలు హాజరయ్యేందుకు.. ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడతారని తెలిపారు. ఈనేపథ్యంలో కనీసం 15 రోజులు డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. స్పందించిన రిజిస్ట్రార్ రామచంద్రం పరీక్షల నియంత్రణాధికారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సతీష్‌రెడ్డి, ఎస్.రవి, శ్రీధర్, అహ్మద్‌పాషా, లక్ష్మీనర్సయ్య, పరిమల్ తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రార్‌కు ప్రైవేట్ యాజమాన్యాల అసోసియేషన్ వినతి


