ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో ఫీజుల దోపిడీ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో ఫీజుల దోపిడీ

Apr 18 2026 7:17 AM | Updated on Apr 18 2026 7:17 AM

కాశిబుగ్గ: రాష్ట్రంలోని ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ, తల్లిదండ్రులను పీడిస్తున్నాయని మెడికో పేరెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణచారి అన్నారు. శుక్రవారం ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌ కోర్సులకు అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ వివిధ జిల్లాల నుంచి వచ్చి న మెడికోల తల్లిదండ్రులు వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సీటీని ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో విద్యార్థులు నాలుగున్నర సంవత్సరాల ఎంబీబీఎస్‌ కోర్సు చదివితే ఐదు సంవత్సరాల ఫీజులను బీ, సీ కేటగిరిల్లో వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఎంబీబీఎస్‌ కోర్సు నాలుగున్న ర సంవత్సరాలు కాగా అదనంగా ఆరునెలల ఫీజు వసూలు చేయడం వల్ల బీ కేటగిరి విద్యార్థి అదనంగా రూ.6 లక్షలు, సీ కేటగిరి విద్యార్థికి రూ.12 లక్షలు వసూలు చేస్తున్నారని తెలిపారు. వీటిపై తాము ప్రీ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని తెలిపారు. ఏ కేటగిరి సంబంధించి యూనివర్సీటీ ఫీజు రూ.60వేలు చెల్లించాల్సి ఉండగా, కాలేజీలు మాత్రం ఇతర ఫీజుల పేరుతో రూ.లక్షా యాభై వేల నుంచి రూ.2లక్షల 60వేల వరకు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై కాళోజీ హెల్త్‌ యూనివర్సీటీ అధికారులు స్పందించి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వీసీ రమేష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్‌ నాయకులు కట్ట వెంకట్రావు, సుజాత, సంధ్య స్ఫూర్తి, శ్రీనివాస్‌ గౌడ్‌, దుర్గాప్రసాద్‌, రామకృష్ణ, నాగేందర్‌, రవికిషన్‌ ఉన్నారు.

మెడికో పేరెంట్స్‌ అసోసియేషన్‌

అధ్యక్షుడు సత్యనారాయణచారి

కాళోజీ యూనివర్సిటీ ముట్టడి

Advertisement
 
Advertisement
Advertisement