హన్మకొండ: ప్రధాని నరేంద్ర మోదీతో ముఖాముఖి కార్యక్రమానికి వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనంలో ఈ నెల 12, 13 తేదీల్లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధ్యక్షతన ‘మై భారత్ బడ్జెట్ క్వెస్ట్–2026’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ వ్యవసాయ కళాశాల మూడో సంవత్సరం విద్యార్థి బి.విష్ణుతేజ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జి.అరవింద్, ఎస్.శైలు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి విజేతలుగా నిలిచి ప్రధాన మంత్రి ముఖాముఖి కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుక్ మండవియాతో నేరుగా మాట్లాడే అవకాశం పొందారు. ఈ సందర్భంగా 2026–27 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయించిన రూ.1.32 లక్షల కోట్ల నిధులు, ముఖ్యంగా ‘భారత్–విస్తార్’ వంటి సాంకేతిక విప్లవాల గురించి చర్చించారు. ప్రతిభ కబరిచిన విద్యార్థులను వరంగల్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ వి.రవీందర్ నాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు బి.రాజు, గోపిక, అధికారులు అభినందించారు.


