హన్మకొండ చౌరస్తా: భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) నుంచి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, బీఎస్‌సీ (హాన్స్) అగ్రికల్చర్ ప్రోగ్రాం రెండింటికీ తమకు గుర్తింపు లభించిందని ఎస్‌ఆర్ యూనివర్సిటీ చాన్స్‌లర్ ఎ.వరదారెడ్డి తెలిపారు. హనుమకొండ కాకాజీకాలనీలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ గుర్తింపుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్కూల్, కాలేజీ ప్రోగ్రాం స్థాయిలో ఐసీఏఆర్ గుర్తింపు పొందిన మొదటి ప్రైవేట్ యూనివర్సిటీగా నిలిచిందని అన్నారు. 16 మార్చి 2026 నుంచి ఐదేళ్లు అమలులో ఉంటుందని, నేషనల్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అక్రిడిటేషన్ బోర్డు (ఎన్‌ఏఈఏబీ) 42వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలపై విశ్వవిద్యాలయం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమన్నారు. తద్వారా ఐసీఏఆర్ స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్‌కు అర్హత పొందుతారని, విశ్వవిద్యాలయానికి నిధులు, పరిశోధన అవకాశాలు లభిస్తాయని ఆనందం వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ దీపక్‌గార్గ్ మాట్లాడుతూ ఈ గుర్తింపు విశ్వవిద్యాలయ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని అన్నారు. స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ డీన్ ప్రొఫెసర్ జి.భూపాల్‌రాజ్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో 13 ఆధునిక ప్రయోగశాలలు, వ్యవసాయభూములు, పాలీహౌస్, షేడ్‌నెట్, హైడ్రోపోనిక్స్, వాతావరణ పరిశీలన కేంద్ర సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల కోసం గ్రామీణ వ్యవసాయ పనుల అనుభవ కార్యక్రమాలు, పదికి పైగా అనుభవ ఆధారిత అభ్యాసంతోపాటు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో 25కు పైగా ఒప్పందాలు ఉన్నాయని అన్నారు. ఈ ఇంటర్న్‌షిప్ 75 శాతం కంటే ఎక్కువ ప్లేస్‌మెంట్ రేటును సాధిస్తున్నారని, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ దాదాపు 90 శాతం అధ్యాపకులు డాక్టరేట్, పోస్ట్ డాక్టరేట్ అర్హతలు కలిగిన వారని తెలిపారు. దేశవిదేశాల నుంచి విద్యార్థులు చేరడం వలన విద్యా ప్రమాణాలు మరింత బలపడుతున్నాయని అన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీవీ రమణరావు, డీన్ ఆపరేషన్స్ అండ్ గ్రోత్ ప్రొఫెసర్ అర్చనారెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీవీ రాజశేఖర్, ఐక్యూసీ ప్రతినిధులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
చాన్స్‌లర్ ఎ.వరదారెడ్డి


