సూర్యుడు సలసల..జనం విలవిల | - | Sakshi
Sakshi News home page

సూర్యుడు సలసల..జనం విలవిల

Apr 15 2026 7:20 AM | Updated on Apr 15 2026 7:20 AM

సాక్షి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వరంగల్‌, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ ఆరు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు వడదెబ్బతో ఇప్పటికే నలుగురు మృతిచెందారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటుండడంతో జనాలు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. సోమవారం వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో రెండు వడదెబ్బ మరణాలు, అంతకుముందు రెండు ఘటనలు జరగడంతో హైరానా పడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జిల్లా వైద్యారోగ్యవిభాగాధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి సంచాలకురాలు దివ్యదేవరాజన్‌ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించండి..

ఉదయం 10 గంటల్లోపు పనులు పూర్తి చేసుకోవాలి. మళ్లీ సాయంత్రం ఐదు గంటల తర్వాత చేపట్టాలి. తెల్లని కాటన్‌ వస్త్రాలు ధరించడం, తలకు తెల్లని టోపీ, చెవులలోకి వేడి గాలి వెళ్లకుండా వస్త్రం, రుమాలు కట్టుకోవాలి. గొడుగు వాడితే మంచిది. ద్రవ పదార్థాలు, నీరు, తరచుగా ఓఆర్‌ఎస్‌ తీసుకోవాలి. వెంట కొద్దిగా ఉప్పు, చక్కెర కలిపిన సాధారణ నీటి సీసా ఉంచుకోవాలి. వృద్ధులు, పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. నీరసంగా ఉంటే వెంటనే దగ్గరలోని వైద్యుడికి చూపించాలి.

– డాక్టర్‌ సాంబశివరావు,

వరంగల్‌ జిల్లా వైద్యారోగ్య విభాగాధికారి

40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

ఇప్పటికే నాలుగు వడదెబ్బ మరణాలు నమోదు

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

రానున్న రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం

అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement