అంబేడ్కర్‌ ఆశయ సాధనకు పునరంకితం కావాలి | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు పునరంకితం కావాలి

Apr 15 2026 7:20 AM | Updated on Apr 15 2026 7:20 AM

వరంగల్‌ అర్బన్‌: అంబేడ్కర్‌ ఆశయ సాధనకు పునరంకితం కావాలని మేయర్‌ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో మంగళవారం అంబేడ్కర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యాలయ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహానికి మేయర్‌ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్‌, బల్దియా ఇన్‌చార్జ్‌ మేయర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేశారు. అదనపు కమిషనర్‌ చంద్రశేఖర్‌, సీహెచ్‌ఓ రమేశ్‌ పీఆర్వో అయూబ్‌అలీ, ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, డిప్యూటీ కమిషనర్‌ బిర్రు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

జనగణనకు మ్యాపులు రూపొందించాలి

జనగణనకు మ్యాపులను రూపకల్పన చే యాలని నగర మేయర్‌ గుండు సుధారాణి హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలోజనగణన హౌస్‌ బ్లాక్‌ లిస్టింగ్‌ ప్రక్రియను మేయర్‌ గుండు సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేసి పనితీరును సమీక్షించారు. డిప్యూటీ కమిషనర్‌ ప్రసునారాణి పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

మహిళ మృతి

కాశిబుగ్గ: వరంగల్‌ దేశాయిపేటలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతిచెందగా, భర్త తీవ్ర గాయాలపాలై ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వరంగల్‌ నాయుడు పంపు మంగలికుంట ప్రాంతానికి చెందిన జెట్టి విజయలక్ష్మి (45), భర్త సదానందం తమ కుమార్తె వివాహం గురించి ఆరెపల్లిలోని బంధువులకు చెప్పడానికి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో దేశాయిపేట పోచమ్మ దేవాలయం వద్ద వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ.. బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, సదానందం తీవ్ర గాయాలపాలై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సదానందంను ఎంజీఎం తరలించారు. అతడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు లారీ డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. కాగా, తమ కుమార్తె పెళ్లి గురించి ఆరెపల్లిలోని బంధువులకు చెప్పడానికి సంతోషంతో వెళ్తున్న తల్లిదండ్రులను లారీ మృత్యురూపంలో బలితీసుకోవడంతో కుటుంబ సభ్యులను కన్నీరుమున్నీరుగా విలపించారు.

Advertisement
 
Advertisement
Advertisement