సాదాబైనామాల క్రమబద్దీకరణకు భూ క్రయ,విక్రయదారుల ‘అఫిడవిట్’ల నిబంధన చిక్కులు తొలగాయి. ఆర్డీఓలే విచారణాధికారులగా దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నిబంధనల పేరిట ముందుకు సాగని సాదాబైనామాల క్రమబద్ధీకరణ ఇకపై ఫాస్ట్‌ట్రాక్‌లో జరగనుంది. ఉమ్మడి వరంల్ జిల్లాలో 2020 నవంబర్ 10 నుంచి పెండింగ్‌లో ఉన్న సుమారు 1.90 లక్షల దరఖాస్తులకు పరిష్కారం దొరకనుంది. రైతులకు ఊరట కలగనుంది.
ఈ ఫొటోలోని రైతు పేరు జేరుపోతుల విజయ్ కుమార్. హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామం. ఈయనకు మొత్తం నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తాతల నుంచి వారసత్వంగా వచ్చింది. కాస్తులో ఉన్నా.. విజయ్‌కుమార్ తాతకు పట్టా కాలేదు. తండ్రికి అందులోనుంచి అర ఎకరం మాత్రమే పట్టా కాగా.. నాలుగు ఎకరాల కోసం సాదాబైనామానుంచి పట్టా కోసం ఐదున్నరేళ్లలో రెండు పర్యాయాలు దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం భూ భారతిలో కూడా దరఖాస్తు చేశాడు. అధికారుల ఇప్పటివరకు పట్టా గురించి ఎలాంటి సమాచారం రాలేదని, ఇప్పటికై నా సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలిగించాలని రైతు విజయ్‌కుమార్ కోరుతున్నారు.
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా ఫైళ్లకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌కు సిద్ధమవుతూ, జిల్లాల వారీగా పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయడానికి చర్యలు ప్రారంభించింది. దీనివల్ల వేలాది మంది రైతులు, పేదలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన 112జీఓ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకురావడంతో పాటు ఆ జీఓపై వచ్చిన అభ్యంతరాలు, సాదా బైనామాల పరిష్కారంపై విధివిధానాలను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్‌ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఆదేశాలు ఇచ్చినా.. భూక్రయ, విక్రయదారులు ఇద్దరి అఫిడవిట్లు, తదితర నిబంధనల కారణంగా ముందుకు సాగలేదు. తాజాగా అఫిడవిట్ల నిబంధనలను సడలించడంతోపాటు దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించే అధికారాలు పూర్తిగా ఆర్డీఓలకు ఇవ్వడంతో ఆ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది.
ఐదున్నరేళ్లుగా పెండింగ్‌లో..
సాదాబైనాల క్రమబద్ధీకరణ కోసం జీఓలు ఎన్ని తెచ్చినా దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. 2016లో జీఓనం.153, 2020లో జీఓ 112లను తీసుకువచ్చారు. 2014 జూన్ 2కు ముందు సాదాబైనామాలు కలిగిన భూములను క్రమబద్ధీకరించడం.. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసే ఉద్దేశంతో రెండు పర్యాయాలు, ఈ రెండు జీఓలు తెచ్చారు. జీఓ నం.112పై ‘పిల్’దాఖలు కావడంతో దానిని అమలు కాకుండా నిలిపివేశారు. ఆ తర్వాత రెవెన్యూ సదస్సుల ద్వారా దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వాటి పరిష్కారం మంత్రివర్గ ఉపసంఘం వేసింది. గతేడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహించింది. ఈ సదస్సుల్లో అత్యధికంగా సాదాబైనామాలపైనే దరఖాస్తులు వచ్చాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు మరోసారి భూభారతి సదస్సులో దరఖాస్తులు చేశారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, అంతకు ముందున్న మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,89,739లకు చేరింది. దీంతో ప్రభుత్వం హైకోర్టును అశ్రయించి, సాదాబైనామాలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. విచారణ అనంతరం సాదాబైనామాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, క్షేత్రస్థాయి పరిశీలన పేరిట తాత్సారం జరుగుతూ వచ్చింది. నిబంధనల సడలింపు, ఆర్‌ర్డీఓల క్షేత్రస్థాయి పరిశీలన ఉత్తర్వుల నేపథ్యంలో రైతుల దరఖాస్తులను పరిశీలించి, అర్హత కలిగిన వాటిని పరిష్కరించనున్నారు.
‘అఫిడవిట్’ నిబంధనల సడలింపు.. ‘రెవెన్యూ’కు ఆదేశాలు
ఫాస్ట్‌ట్రాక్‌లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారం
ఉమ్మడి వరంగల్‌లో 1.90 లక్షల దరఖాస్తులు
2020 నుంచి వెయిటింగ్.. ఆర్డీఓలకు కీలక అధికారాలు
త్వరలోనే సాదాబైనామాలకు పరిష్కారం..


