భావిభారతం.. ఆరోగ్యమే ప్రధానం | - | Sakshi
Sakshi News home page

భావిభారతం.. ఆరోగ్యమే ప్రధానం

Apr 14 2026 8:58 AM | Updated on Apr 14 2026 8:58 AM

ఉమ్మడి జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు, పిల్లల వివరాలు

కాజీపేట: భావిభారత పౌరులు ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా వయసుకు తగ్గట్టు ఎత్తు, బరువు పెరగడంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. దీనికోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతీ చిన్నారికి ప్రత్యేక ప్రొఫైల్‌ తయారు చేయిస్తోంది. దీంతో ఇక నుంచి ప్రతీ నెలా పిల్లల ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ.. ఆ ప్రొఫైల్‌లో నమోదు చేస్తారు. దీనిప్రకారం ఏ చిన్నారైనా పౌష్టికాహార లోపంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా ఆరోగ్య కార్డులను ముద్రించి అంగన్‌వాడీ కేంద్రాలకు చేరవేసింది. దీని ప్రకారం ప్రతీ నెల 1 నుంచి 5వ తేదీలోపు ప్రతీ కేంద్రంలో చిన్నారుల వివరాలను నమోదు చేసి వాటిని తల్లిదండ్రులకు అందిస్తారు.

ఆటపాటలతో విద్యాబుద్ధులు...

రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆటాపాటలతో విద్యాబుద్ధులు నేర్పుతూ ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం అందిస్తోంది. కేంద్రానికి వచ్చే ప్రతీ చిన్నారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఐదేళ్లలోపు చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యత, భద్రత, పంపిణీలో అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతోంది. దీనికితోడు వివిధ రకాల ఆహార పదార్థాలు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఇక నుంచి చిన్నారుల బరువు,ఎదుగుదల వివరాలను ప్రతీనెల రికార్డులలో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా పౌష్టికాహారం ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటున్నారనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా శిశు, సంక్షేమ శాఖ అధికారులు బాలల ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పుట్టుక నుంచి వివరాలు..

ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల వివరాలు నమోదు చేసుకుంటున్నారు. పాఠశాలలో చేరే ఐదేళ్లలోపు పిల్లలకు సంబంధించి బరువు, ఎత్తు ఎదుగుదల వివరాలను నమోదు చేసి నివేదికల రూపంలో భద్రపరిచేందుకు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి వివిధ రంగులతో బాల బాలికలకు వేర్వేరుగా రికార్డులను పంపిణీ చేశారు. చిన్నారి పుట్టగానే వివరాలు నమోదు చేసి అంగన్‌వాడీ ఉపాధ్యాయుల దగ్గర భద్రపరిచేలా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలకు వెళ్లే ఐదేళ్లలోపు చిన్నారుల వివరాలను ప్రతీనెలా ప్రొఫైల్‌లో నమోదు చేస్తారు.

నమోదు అంశాలు ఇవీ..

అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతీ చిన్నారి ఎత్తు, బరువు, భుజం చుట్టు కొలతను ప్రతీ నెలా నమోదు చేస్తారు. వయసుకు తగిన విధంగా పెరుగుదల, ఎత్తు సక్రమంగా ఉందా? లేదా అనేది చిన్నారి ప్రొఫైల్‌ చూస్తే ఇట్టే తెలిసిపోనుంది. దీనికితోడు ఏటా చిన్నారి ఫొటో సేకరించి పాఠశాలకు వెళ్లే ఐదేళ్ల సమయానికి ప్రొఫైల్‌లో అతికించాల్సి ఉంటుంది. ఎవరైనా పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తేలితే ఆరోగ్యశాఖ అధికారుల సూచనల మేరకు వారికి బలవర్థకమైన ఆహారం అందించేందుకు చర్యలు చేపడతారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతీ చిన్నారికి ప్రత్యేక ప్రొఫైల్‌

పౌష్టికాహార లోపం ఉంటే ప్రత్యేక శ్రద్ధ

పుట్టుక నుంచి ప్రతీ వివరాలు నమోదు చేస్తున్న ప్రభుత్వం

జిల్లా కేంద్రాలు పిల్లలు

హనుమకొండ 788 43,095

భూపాలపల్లి 644 21,691

వరంగల్‌ 919 47,292

ములుగు 640 18,548

జనగామ 695 18,548

మహబూబాబాద్‌ 1437 39,187

Advertisement
 
Advertisement
Advertisement