● విద్యుదాఘాతంతో మహిళ మృతి
వర్ధన్నపేట : దండెంపై తడిసిన టవల్ ఆరేస్తూ ఓ మహిళ మృత్యుఒడికి చేరింది. విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఈ ఘటన సోమవారం మండలంలోని ఇల్లందలో చోటు చేసుకుంది. ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఊర సమ్మక్క(35) తెల్లవారుజామున తడిసిన టవల్‌ను దండెంపై ఆరేస్తోంది. ఈ సమయంలో దండేనికి తాకి ఉన్న విద్యుత్ తీగలను గమనించలేదు. చూడకుండా తగలడంతో షాక్ తగిలి కింద పడింది. దీంతో భర్త రాజ్‌కుమార్ ఆమె అరుపులు విని బయటకు వచ్చి చూడగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. మృతురాలి భర్త రాజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన యువ రైతు గాదం వినయ్(38) సోమవారం వడదెబ్బతో మృతి చెందాడు. ఉదయం తన మామ రాజాలుతో కలిసి వ్యవసాయ బావివద్దకు వెళ్లాడు. పనులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మృతుడికి భార్య శిరీష, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రణధీర్ రెడ్డి తెలిపారు.
చిన్నరామన్‌చర్లలో వ్యక్తి..
బచ్చన్నపేట : వడదెబ్బతో మండలంలోని చిన్నరామన్‌చర్ల గ్రామానికి చెందిన రామగళ్ల మల్లయ్య (55) సోమవారం మృతి చెందాడు. రోజు మాదిరిగానే మల్లయ్య ఆదివారం బచ్చన్నపేటలో కూలీ పనులు చేశాడు. అనంతరం రాత్రి ఇంటికి వెళ్లలేదు. దీనిపై మృతుడి భార్య పుష్ప.. బంధువులకు ఫోన్ చేసి వాకబు చేసినా ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని కేజీబీవీ పక్కన ఉన్న గుంతలో చనిపోయి కనిపించాడు.
రోడ్డు భద్రతపై వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
హన్మకొండ అర్బన్/ఖిలావరంగల్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల సందర్భంగా సోమవారం హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద వాల్‌పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. ఇన్‌చార్జ్ ఆ ర్టీఓ శోభన్ బాబు, రవాణా శాఖ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.
సూపర్‌వైజర్ల మార్పు
కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో ఇద్దరు శానిటేషన్ సూపర్‌వైజర్లను మార్పు చేశారు. సదరు శానిటేషన్ సూపర్‌వైజర్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయడంతో సూపర్‌వైజర్ల బాధ్యతల నుంచి వారిని తొలగించారు. సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు సూపర్‌వైజర్లుగా బాధ్యతలు అప్పగించారు. కాగా, గత నెల 30న డబ్బులు తీసుకుంటున్నట్లు వచ్చిన ఆరోపణల్లో రెగ్యులర్ స్వీపర్‌కు మెమో జారీ చేయగా, ప్రైవేట్ స్వీపర్‌ను విధులకు దూరంగా ఉంచారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మిని వివరణ కోరగా ఆస్పత్రిలో మార్పుల్లో భాగంగానే మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు వివరించారు.


